కమాండ్ కంట్రోల్, కరోనా ఎవరికీ సోకలేదు: మంత్రి ఈటల
రాష్ట్రంలో కరోనా వైరస్ ఎవరికీ కూడ సోకలేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు
హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా వైరస్ ఎవరికీ కూడ సోకలేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశామన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఈ కమిటీ పనిచేస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇద్దరు శాంపిల్స్ పై ఇంకా స్పష్టత లేదన్నారు మంత్రి. మరోసారి ఈ ఇద్దరి శాంపిల్స్‌ను మరోసారి పూణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపినట్టుగా ఆయన చెప్పారు.
వదంతులను నమ్మకూడదని మంత్రి ప్రజలను కోరారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ వద్ద ముందు జాగ్రత్తగా శానిటేషన్ చర్యలు తీసుకొన్నట్టుగా మంత్రి తెలిపారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎవరికీ కూడ కరోనా వైరస్ సోకలేదని చెప్పింది.
మహేంద్ర హిల్స్ లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తి ఇంట్లోని నలుగురికి నెగిటివ్ రిపోర్టు వచ్చిందని ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా అనుమానం ఉంటే 104 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని మంత్రి కోరారు. వ్యాధి సోకిన వారి నుండి ఆ కుటుంబానికి మొత్తం వ్యాధి వస్తోందనే ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి వివరించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల నుండి అనుమానిత శాంపిల్స్ ను సేకరించేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. రాష్ట్రంలోని 45 మందికి కరోనా వైరస్ లక్షణాలు లేవని రిపోర్టు తేలిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
బుధవారం నాడు 20 మందికి పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ సేకరించామన్నారు. ఈ శాంపిల్స్ ను పరీక్షల కోసం పంపినట్టుగా ఆయన ప్రకటించారు.