హైదరాబాద్: కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించడానికి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రత్యేక ఆస్పత్రిని నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. అనంతగిరిలోనే ఆ ఆస్పత్రిని స్థాపించాలని నిర్ణయించిందనేది ఆసక్తికరమైన విషయమే. అందుకు చెప్పే ప్రధాన కారణం... అనంతగిరి జనంతో క్రిక్కిరిసిన హైదరాబాదుకు దూరంగా ఉంటుందనేది. దానివల్ల రోగులను ప్రజలకు దూరంగా ఉంచి, అది వ్యాప్తి కాకుండా నిరోధించడానికి వీలవుతుంది.

అంతకన్నా ప్రధానమైన కారణం మరోటి ఉంది. అనంతగిరి చాలా ప్రశాంతమైన ప్రదేశం. అహ్లాదకరమైన వాతావరణంతో హాయిగొలుపుతుంది. తెలంగాణలోని దట్టమైన అడవుల్లో ఇదొకటి. అనంతగిరి కొండల నుంచే నీరు హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ ల్లోకి ప్రవహిస్తుంది. అది మూసీ నది జన్మస్థలం. దాన్నే ముచుకుంద నది అని కూడా అంటారు. వికారాబాద్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

Also Read: మరో రెండు పాజిటివ్ కేసులు: అనంతగిరిలో కరోనాకు ప్రత్యేక ఆసుపత్రి

ప్రాచీనమైన గుహలు, మధ్యయుగాల్లోని నిర్మాణాలు, దేవాలయం వంటివి అనంతగిరి సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటుతాయి. హైదరాబాదుకు 90 కిలోమీటర్ల దూరంలో గల అనంతగిరి కొండల్లో మూసి నది పుడుతుంది. అది హైదరాబాదు గుండా 240 కిలోమీటర్లు ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. 

అనంతగరి కొండల్లోనే అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఇది హైదరాబాదుకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విష్ణువు అవతారం అనంత పద్మనాభస్వామి. ఈ దేవుడి వల్లనే ఆ ప్రాంతానికి అనంతగిరి అనే పేరు వచ్చింది. దానికి సమీపంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే హోటల్ కూడా ఉంది. 

Also Read: హోలీ వేడుకలపై నిషేధం: తెలంగాణ హైకోర్టులో పిటిషన్

ఆలయానికి సమీపంలోనే నాగసముద్రం అనే సరస్సు ఉంటుంది. దాన్ని కోటపల్లి జలాశయం అని కూడా పిలుస్తారు. అనంతగిరి పర్వతాలకు ఇది 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అడవిలో రెండు ట్రెక్కింగ్ ట్రయల్స్ ఉన్నాయి. ఒక్కటి అనంత పద్మనాభ స్వామి ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. మరోటి ఆలయానికి అర కిలోమీటరు దూరం నుంచి ప్రారంభమవుతుంది. అది కెరెళ్లి దిశగా వెళ్తాయి.