నేషనల్ పార్కులో సింహాలను చూడటానికి వెళ్లిన పర్యాటకులకు ఒళ్లు గగుర్పోడిచే సంఘటన ఎదురైంది. వీరు వెళ్తున్న కారును సింహాలు చుట్టుముట్టి.. కారుపైకి ఎక్కడంతో అందులో వున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు.

గతేడాది జూలై నాటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలోని హర్ట్‌బీస్‌పోర్ట్‌లోని లయన్ అండ్ సఫారి పార్క్‌లో ఈ ఘటన జరిగింది.

Also Read:రియల్ లైఫ్‌లో ‘‘పా’’ : 8 ఏళ్లకే 80 ఏళ్ల బామ్మలా.. అరుదైన వ్యాధితో కన్నుమూసిన చిన్నారి

సదరు వీడియోలో సింహాల గుంపు తెలుపు రంగులో ఉన్న పర్యాటకుల వాహనం వద్దకు చేరుకుంది. వీటిలో ఒకటి కారుపైకి ఎక్కి తలుపును పంజాతో బలంగా కొడుతోంది. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ నెమ్మదిగా ఆ జీపును కదిలించాడు. దీంతో భయపడిన సింహం వెనక్కి దూకింది.

దీనిపై ఆ పార్క్ జనరల్ మేనేజర్ ఆండ్రీ లాకాక్ మాట్లాడుతూ... ఆ రోజున మూడు మగ సింహాలు వాహనాలపైకి ఎక్కినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అయితే అవి ఈ పార్క్‌లోకి కొత్తగా ప్రవేశించాయని చెప్పారు.

Also Read:పెంపుడు కుక్క తుంటరి పని: ఎంగేజ్‌మెంట్ రింగ్ తినేసింది

సింహాలు కారును చుట్టుముట్టిన వీడియో ఆన్‌లైనులో సంచలనం సృష్టించింది. దీనికి 12,000కు పైగా లైకులు, వందలాది కామెంట్లు వచ్చాయి. అదే సమయంలో కొందరు నెటిజన్లు పర్యాటకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఉన్న ఆ సింహాలు కారును తెరిచే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయని ఒకరు కామెంట్ చేశారు.

మరోవైపు ఈ సంఘటన తర్వాత సింహాలను ఓ భారీ ట్రయిలర్‌లో ప్రజలకు దూరంగా ఉన్న పార్క్‌కు తరలించారు. కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నందన్‌వన్ జంగిల్ సఫారి వద్ద ఓ పర్యాటక వాహనాన్ని పులి వెంబడించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.