కెనడాను వదిలేసి భారత్ కు వెళ్లండి.. హిందువులకు సిక్కుస్ ఫర్ జస్టిస్ హెచ్చరిక
కెనడాలో నివసిస్తున్న భారత హిందువులు తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలని సిక్కుస్ ఫర్ జస్టిస్ హెచ్చరిచ్చింది. ఈ మేరకు ఆ నిషేదిత ఉగ్రవాద సంస్థ లీగల్ సెల్ న్యాయవాది గురుపత్వంత్ పన్నూన్ ఒక వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఖలిస్తాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారత సంతతి ప్రజలలో.. ముఖ్యంగా హిందువులలో ఆందోళన నెలకొంది. తాజాగా ఖలిస్తానీ అనుకూల సంస్థ అక్కడి భారతీయ మూలాలున్న పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. భారత సంతతికి చెందిన హిందువులు కెనడాను విడిచి పెట్టి భారత్ కు సిక్కుస్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) వెళ్లిపోవాలని హెచ్చరించింది.
‘‘ఇండో-హిందూ కెనడాను విడిచిపెట్టండి. మీరు భారత్ కు మద్దతు ఇవ్వడమే కాకుండా ఖలిస్తాన్ అనుకూల సిక్కుల మాటలు, వ్యక్తీకరణ అణచివేతకు మద్దతు ఇస్తున్నారు’’ అని అని ఎస్ఎఫ్ లీగల్ కౌన్సెల్ న్యాయవాది గురుపత్వంత్ పన్నూన్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇది వైరల్ గా మారింది. కాగా.. ఎస్ఎఫ్ జే 2019 లో భారతదేశంలో నిషేధించబడిన ఖలిస్తాన్ అనుకూల సంస్థ. అలాగే భారతీయ హిందువులను హెచ్చరించిన పన్నూన్ ను గతంలోనే భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది.
పన్నూన్ బెదిరింపు వీడియోపై కామెంటేటర్ రూపా సుబ్రమణ్య స్పందించారు. ‘‘రంగుల ప్రజలందరూ కెనడాను విడిచి వెళ్లిపోవాలని ఒక శ్వేతజాతి ఆధిపత్యవాది బెదిరించి ఉంటే, అల్లర్లను ఊహించండి. కెనడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ ఖలిస్తానీ హిందువులను బెదిరిస్తే అందరూ కళ్లు మూసుకుని మరోలా చూస్తున్నారు.’’ అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు.
కాగా.. అక్కడి హిందూ కెనడా మంత్రి అనితా ఆనంద్ శాంతియుతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘న్యాయ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాల్సిన సమయం ఇది. మనమందరం ప్రశాంతంగా, ఐక్యంగా, సానుభూతితో ఉంటాం.’’ అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్ లో జరిగిన నిజ్జర్ హత్యకు, భారత ప్రభుత్వ ఏజెంట్లకు మధ్య సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం వ్యాఖ్యానించడంతో పన్నూన్ నుంచి ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే ఆయన వాదన అసంబద్ధం, ప్రేరేపితమని భారత్ మంగళవారం కొట్టిపారేసింది. ఈ పరిణామం జరిగిన కొద్ది గంటల్లోనే ట్రూడో స్పందించారు. కెనడా ఎవరినీ రెచ్చగొట్టడం లేదని, అలాగే రెచ్చగొట్టాలని కూడా చూడటం లేదని అన్నారు.