Khalistan Protest : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు బ్రిటన్ పర్యటనలో ఖలిస్థానీ నిరసనలు ఎదురయ్యాయి. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రిపై వాహనంపై దాడికి నిరసనకారులు యత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Jaishankar : భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు బ్రిటన్ లో చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న విదేశాంగమంత్రిని ఖలిస్థానీ నిరసనకారులు అడ్డుకుని నిరసన తెలిపారు. మంత్రి ఓ కార్యక్రమం కోసం లండన్‌లోని చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్‌ వెళ్లగా అక్కడ ఖలిస్థాని జెండాలు పట్టుకుని కొందరు నిరసన తెలియజేసారు. కార్యక్రమం అనంతరం కారులో వెళ్ళేందుకు జైశంకర్ బయటకు రాగా ఆయనవైపు కొందరు దూసుకువచ్చారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. 

ఖలిస్థాని నిరసనకారులు తమ జెండాలు, లౌడ్ స్పీకర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. అంతేకాదు భారత జాతీయ జెండాను అవమానకరంగా కాళ్ల కింద వేసుకుని తొక్కడం, చించేయడం చేసారు. నిరసనకారులు జైశంకర్ కారును అడ్డుపడగా వారిని తప్పించి ఆయనను ముందుకు తీసుకెళ్లారు భద్రతా సిబ్బంది.

ఇలా జైశంకర్ పై ఖలిస్థాని నిరసనకారులు అడ్డుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో బ్రిటన్ అధికారులు మొదట్లో ఖలిస్థానీ నిరసనకారులపై చర్య తీసుకోవడానికి వెనకాడినట్లు కనిపించినప్పటికీ ఒక వ్యక్తి దూకుడుగా మంత్రి కాన్వాయ్ వైపు దూసుకెళ్ళడంతో రంగంలోకి దిగారు. మంత్రి కారువద్దకు దూసుకొచ్చిన వ్యక్తిని నిలువరించి ఇతర నిరసనకారులను అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Scroll to load tweet…

జైశంకర్ తన యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనలో భాగంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్, విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామ్మీ ఇంకా చాలా మంది సీనియర్ నాయకులతో చర్చలు జరిపారు. అలాగే వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. మార్చి 9 వరకు బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. 

బ్రిటన్‌లో ఖలిస్తానీ మద్దతుదారులు నిరంతరం నిరసనలు తెలుపుతూ భారత్‌కు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గత జనవరిలో లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల ఖలిస్తాన్ అనుకూల నిరసనకారులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు హారో పట్టణంలోని ఒక సినిమా హాల్‌లోకి చొరబడి కంగనా రనౌత్ నటించిన "ఎమర్జెన్సీ" సినిమా ప్రదర్శనను ఆపేందుకు ప్రయత్నించారు. ఇలా భారత్ వ్యతిరేకంగాబ్రిటన్ లో కొనసాగుతున్న ఖలిస్థాన్ నిరసనలపై భారత్ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది... అయినా అధికారులు పట్టించుకోకపోవడం ఆందోళనకరం. 

బ్రిటన్ పర్యటనపై జైశంకర్ ఏమన్నారంటే... 

ఖలిస్థాన్ మద్దతుదారుల నిరసనను పక్కనబెడితే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ బ్రిటన్ పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికన జైశంకర్ వెల్లడించారు. ''తనకు టెన్ డౌనింగ్ స్ట్రీట్‌లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ను కలిసే అవకాశం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను'' అంటూ ట్వీట్ చేసారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు

ఇక బ్రిటన్ తో పాటు ఐర్లాండ్ దేశాలతో భారత్‌కున్న స్నేహపూర్వక సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేసేందుకు జైశంకర్ చర్చిస్తారు. ఐర్లాండ్‌ ప్రధాని సైమన్ హారిస్ తో కూడా జైశంకర్ భేటీ అవుతారు.. భారతీయ కమ్యూనిటీ సభ్యులను కూడా ఆయన కలవనున్నారు.