అబార్షన్ హక్కును కాపాడుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని ఉత్తర్వుల మీద సంతకం చేశారు. రెండు వారాల కిందట అమెరికా సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
వాషింగ్టన్ : అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకోవడానికి మహిళల హక్కులను కాపాడుతూ అమెరికా అధ్యక్షుడు Joe biden శుక్రవారం దీనికి సంబంధించిన పాలన ఉత్తర్వులపై సంతకం చేశారు. రాజ్యాంగబద్ధమైన ఈ హక్కును రెండు వారాల కిందట అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీని మీద తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే ఈ హక్కును పరిరక్షించడానికి గట్టిగా చర్యలు తీసుకోవాలని తన డెమొక్రటిక్ పార్టీ సభ్యుల ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తుది నిర్ణయాధికారం అమెరికా పార్లమెంటుదే కాబట్టి తన ఉత్తర్వుల్లో పరిమిత ప్రయోజనం మాత్రమే ఉంటుందని Joe biden వివరిస్తున్నారు.
ఎందుకంటే ఆ విషయంపై ఇప్పటికే 12 రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మరో 12 రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలో గర్భస్రావం చట్టం సమ్మతమైన రాష్ట్రాలకు మహిళలు వెళ్లి సదరు సేవలు వినియోగించుకోవడానికి, ప్రభుత్వం అనుమతించిన గర్భస్రావ మందులను పొందడానికి కోర్టు తీర్పు అడ్డు రాకుండా చూడాలనేది బైడెన్ ఉత్తర్వులోని కీలకాంశం. గర్భస్రావం హక్కును కాపాడటానికి కోర్టులో పోరాటం మొదలు పెట్టాలని న్యాయ శాఖను, ఆరోగ్యం- మానవ సర్వీసుల శాఖను బైడెన్ తన ఉత్తర్వులో ఆదేశించారు.
అబార్షన్ మాత్రలకు సంబంధించిన పోస్టులు తొలగిస్తున్న ఫేస్ బుక్,ఇన్ స్టాగ్రామ్..ఎందుకంటే...
ఇదిలా ఉండగా, జూన్ 28న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ రెండు సోషల్ మీడియా సైట్లలో అబార్షన్ టాబ్లెట్లకు సంబంధించిన పోస్ట్‌లను తొలగిస్తుంది. అబార్షన్ కు సంబంధించిన ఇలాంటి పిల్స్ విషయంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాటిని తీసేయాలని నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సోషల్ మీడియా పోస్ట్‌లు అబార్షన్‌ను నిషేధించే ముందస్తు చట్టాలు శుక్రవారం నుండి హాఠాత్తుగా అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లోని మహిళలనే టార్గెట్ గా చేసుకున్నాయి. అబార్షన్‌ను రాజ్యాంగ హక్కుగా ప్రకటించే 1973 నిర్ణయాన్ని హైకోర్టు రో వర్సెస్ వేడ్‌ని రద్దు చేసింది.
దీంతో దీనికి నిరసనగా మహిళలు మెయిల్‌లో అబార్షన్ మాత్రలను చట్టబద్ధంగా ఎలా పొందవచ్చో వివరించే మీమ్స్,స్టేటస్ అప్‌డేట్‌లు సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో వెల్లువెత్తాయి.కొందరు అబార్షన్ విధానాన్ని నిషేధించే రాష్ట్రాల్లోని మహిళలకు ప్రిస్క్రిప్షన్లను మెయిల్ చేయడానికి కూడా ముందుకొచ్చారు. ఈ పోస్టులను వెంటనే, Facebook, Instagram ఈ పోస్ట్‌లలో కొన్నింటిని తీసివేయడం ప్రారంభించాయి. US అంతటా మిలియన్ల మంది అబార్షన్ యాక్సెస్ గురించిన స్పష్టత కోసం నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ జిగ్నల్ ల్యాబ్స్ విశ్లేషణ ప్రకారం, అబార్షన్ మాత్రల గురించిన సాధారణ ప్రస్తావనలు, అలాగే మైఫెప్రిస్టోన్, మిసోప్రోస్టోల్ వంటి నిర్దిష్ట వెర్షన్‌లను పేర్కొన్న పోస్ట్‌లు శుక్రవారం ఉదయం ట్విట్టర్, ఫేస్‌బుక్, రెడ్డిట్, టీవీ ప్రసారాలలో అకస్మాత్తుగా పెరిగాయి. ఆదివారం నాటికి, జిగ్నల్ 250,000 కంటే ఎక్కువ అటువంటి ప్రస్తావనలను లెక్కించింది.
