Asianet News TeluguAsianet News Telugu

బిల్లు చూసి దిమ్మతిరిగింది.. క్రాబ్ డిష్ ఆర్డర్ చేస్తే..రూ 56వేలు బిల్లు..

ఫ్యామిలీతో రెస్టారెంట్ కు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. క్రాబ్ డిష్ ఆర్డర్ చేస్తే ఏకంగా రూ.56వేల బిల్లు వేశారు. వెంటనే దిమ్మతిరిగి పోలీసులను ఆశ్రయించింది. 
 

Japanese Tourist Calls Police After Being Charged Rs 56,000 For Crab Dish In Singapore restaurant - bsb
Author
First Published Sep 21, 2023, 12:57 PM IST

సింగపూర్‌ : ఇటీవల తన స్నేహితులతో కలిసి సింగపూర్‌లోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లిన జపాన్‌కు చెందిన ఓ టూరిస్ట్ ఫుడ్ బిల్లు చూసి అవాక్కయ్యింది. ఒక క్రాబ్ డిష్ కోసం 680 డాలర్లు (రూ. 56,503) బిల్లు వేయడంతో.. వెంటనే పోలీసులను పిలవాలని కోరింది. తనకు బిల్లు గురించి అర్థం కావడంలేదని తెలిపిందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. 

సింగపూర్ అవుట్‌లెట్ ఏషియావన్ ప్రకారం, జుంకో షిన్బా అనే మహిళ ఆగస్టు 19న సీఫుడ్ ప్యారడైజ్ రెస్టారెంట్‌లో భోజనం చేసింది. తరువాత బిల్లు చెల్లించే సమయానికి ఆమె ఆర్డర్ చేసిన చిల్లీ క్రాబ్ డిష్ ధర సుమారు 680 డాలర్లు అని తెలిసింది. ఒక వెయిటర్ సిఫార్సు చేసిన తర్వాత తాను రెస్టారెంట్ సిగ్నేచర్ డిష్ అలస్కాన్ కింగ్ చిల్లీ క్రాబ్ ను ఆర్డర్ చేసినట్లు షిన్బా వివరించారు. 

నడవలేని తల్లి పై కొడుకు ప్రేమ.. నెట్టింట వీడియో వైరల్..!

వెయిటర్ క్రాబ్‌ ధరను 20 డాలర్లు అని చూపించాడు. కానీ అది 100 గ్రాములకి అనే విషయాన్ని చెప్పలేదు. అంతేకాదు ఆ డిష్ వండేముందు పీత మొత్తం బరువు గురించి తమకు తెలియజేయలేదని ఆమె పేర్కొంది. వారు మొత్తం నలుగురు కలిసి రెస్టారెంట్ కు వెళ్లారు. వారు తినగలిగే దానికంటే 3,500 గ్రాముల డిష్ ఎక్కువగా వచ్చింది. దీంతో వారి దగ్గర 680 డాలర్లు వసూలు చేశారు.

''నలుగురి పెద్దలకు ఒక్క రాత్రి భోజనానికి ఇంత ఖర్చవుతుందని తెలిసి మేమంతా అవాక్కయ్యాం. కొన్ని వేరే రెస్టారెంట్లు పీతలను కావాలినంత మాత్రమే అందిస్తాయి కాబట్టి.. ఇక్కడ మొత్తం పీత మా కోసం మాత్రమే వండుతారని మాకు ఎవరికీ సమాచారం లేదు”అని 50 ఏళ్ల ఆ కస్టమర్ అన్నారు.

బిల్లును చూసి షాక్ అయిన షిన్బా సీఫుడ్ ప్యారడైజ్‌ని పోలీసులను పిలవమని కోరింది. వారి పిలుపు మేరకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్టారెంట్ సిబ్బంది తాము వారికి ఎక్కువ ఛార్జీ చేయలేదని వివరించారు. అంతేకాదు.. ఇలాంటి వంటకాన్నే ఆర్డర్ చేసిన మరొక కస్టమర్ బిల్ ను కూడా ఆమెకు చూపించారని చెప్పారు.

దీనిమీద కాసేపు డిస్కషన్ జరిగింది. ఆ తరువాత రెస్టారెంట్ గుడ్ విల్ తో బిల్లులో సుమారు 78 డాలర్లు (రూ. 6,479) తగ్గింపు ఇవ్వడానికి అంగీకరించింది. దీనిమీద ప్యారడైజ్ గ్రూప్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, కస్టమర్‌లు తమ ఆర్డర్ ఇవ్వడానికి ముందు అలస్కాన్ కింగ్ క్రాబ్ ధర, దాని బరువును వారికి తమ సిబ్బంది "స్పష్టంగా తెలియజేసారు" అన్నారు. తాము ఈ విషయంలో తమ సిబ్బందికి అండగా ఉన్నామని తెలిపారు.

"ఇలాంటి తప్పులు జరగకుండా ఉండడానికే వండడానికి ముందు సిబ్బంది మొత్తం అలస్కాన్ కింగ్ పీతను టేబుల్‌పైకి తీసుకువచ్చి చూపించారు. ఆ తరువాత బిల్ పేమెంట్ దగ్గరికి వచ్చేసరికి కస్టమర్ బిల్లు కట్టడానికి నిరాకరించారు. పోలీసు రిపోర్ట్ చేయమని అభ్యర్థించారు. అందువల్ల, రెస్టారెంట్ మేనేజర్ పోలీసు రిపోర్ట్ చేయడంలో సహకరించారు." అని రెస్టారెంట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే, ఈ సంఘటన గురించి ఆ మహిళ సింగపూర్ టూరిజం బోర్డును కూడా సంప్రదించింది. ఆమె కేసును సింగపూర్ వినియోగదారుల అసోసియేషన్‌కు సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios