జపాన్‌కు మరో నీటి గండం: 122కి చేరిన మృతుల సంఖ్య!

First Published 10, Jul 2018, 10:20 AM IST
Japan Floods: Death Toll Raises To 122
Highlights

జపాన్‌కు మరో నీటి గండం ముంచుకొచ్చింది. గడచిన కొద్ది రోజులుగా జపాన్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా వచ్చిన వరదలు మరో మినీ సునామీని తలపిస్తున్నాయి. పశ్చిమ జపాన్‌‌లో సంభవించిన వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 122కి పెరిగింది.

జపాన్‌కు మరో నీటి గండం ముంచుకొచ్చింది. గడచిన కొద్ది రోజులుగా జపాన్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా వచ్చిన వరదలు మరో మినీ సునామీని తలపిస్తున్నాయి. పశ్చిమ జపాన్‌‌లో సంభవించిన వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 122కి పెరిగింది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే, వీరి సంఖ్య మరింత ఎక్కువయ్యే ఆస్కారం ఉందని, సుమారు 50 మందికి పైగా గల్లంతై ఉంటారని అధికారులు చెబుతున్నారు.

గడచిన గురువారం నుంచి జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దశాబ్ధాల కాలంగా పశ్చిమ జపాన్‌లో మునుపెన్నడూ చూడని విధంగా,  జులై నెలలో సాధారణంగా కురిసే వర్షపాతం కంటే మూడు రెట్లు ఎక్కువగా వర్షాలు నమోదయ్యాయి. ఈ భారీ వర్షాల కారణంగా చుట్టు ప్రక్కల వాగులు, నదులు ప్రొంగి పొరలి లోతట్టు ప్రాంతాలన్నింటినీ ముంచేశాయి. ఈ వరదల్లో అనేక ఇళ్లు, వాహనాలను కూడా ధ్వంసమయ్యాయి.

హిరోషిమా ప్రాంతంలో వచ్చిన వరదల్లో ఎక్కువ మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలు ఇళ్లపైకి చేరి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. వందల సంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. వాహనాలు, ఇళ్లు, రహదారులు, రైల్వే మార్గాలు కొట్టుకుపోయాయి.

జపాన్ సైన్యం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందిస్తోంది. కొండచరియలు విరిగిపడి రహదారులు ధ్వంసం కావడంతో హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు. పలుచోట్ల పడవల సాయంతో సహాయక చర్యలు అందిస్తున్నారు. వర్షాలు మరికొన్ని రోజుల పాటు పడే అవకాశం ఉండటంతో, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత శిబిరాలకు తరలిస్తున్నారు. జపాన్‌లో 1974 తర్వాత మళ్లీ ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు సంభవించడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.

loader