లైఫ్ సేవింగ్ మెడిసిన్, స్లీపింగ్ బ్యాగ్స్.. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయం పంపిన భారత్
ఇజ్రాయెల్- హమాస్ యుద్దం నేపథ్యంలో గాజాలో తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయం అందించేందుకు భారతదేశం ముందుకు వచ్చింది.
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య గత 15 రోజులుగా యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో గాజాలో తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయం అందించేందుకు భారతదేశం ముందుకు వచ్చింది. పాలస్తీనియన్ల కోసం 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రి, 6.5 టన్నుల వైద్య సహాయ సామాగ్రిని తీసుకుని ఐఏఎఫ్ సీ-17 విమానం ఈజిప్ట్‌లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరింది. ఈ సామాగ్రి ఈజిప్టు మీదుగా గాజాకు చేరుకోనుంది.
గాజాకు సాయం పంపించినవాటిలో లైఫ్ సేవింగ్ మెడిసిన్, సర్జికల్ వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు, టార్పాలిన్‌లు, శానిటరీ యుటిలిటీలు, నీటి శుద్ధి మాత్రలు, ఇతర అవసరమైన వస్తువులు ఉన్నాయి. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇక, అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగడంతో యుద్దం మొదలైంది. గాజాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారింది. హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. బాంబు దాడుల్లో 4,300 మంది పాలస్తీనియన్లు మరణించారు.
అయితే చర్చల తర్వాత హమాస్ పాలిత ప్రాంతం గాజాకు శనివారం మానవతాసాయం అందడం ప్రారంభమైంది. ఈజిప్ట్ నుంచి ఆహారం, నీరు, మందులు శనివారం గాజాలోకి ప్రవేశించాయి. 20 ట్రక్కులు ఈజిప్ట్ నుంచి పాలస్తీనాలోకి ప్రవేశించగా.. 2.4 మిలియన్ల నివాసితుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ సాయాన్ని సముద్రంలో నీటి చుక్కగా పేర్కొంటున్నారు.