ఎన్నికలను బహిష్కరించిన ఆ రెండు గ్రామాలు.. ‘ఇప్పటికీ కనీస వసతులు లేవు’
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని రెండు గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాయి. కొన్నేళ్లుగా కనీస వసతుల కోసం డిమాండ్ చేసినా ప్రజా ప్రతినిధులు పట్టించుకోనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ గ్రామస్తులు చెప్పారు.
రాయ్‌పూర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా ఛత్తీస్‌గడ్‌లో రెండు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో భాగంగా పోలింగ్ జరిగే ఛత్తీస్‌గడ్‌లో కొర్బా జిల్లా కూడా ఉన్నది. ఈ జిల్లాలోని రెండు గ్రామాలు సర్దిహ్, బగ్దరిదండ్‌లు ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇచ్చాయి. ఈ రెండు గ్రామాలు కేరకచ్చర్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తాయి. బీజేపీ ఎమ్మెల్యే నాంకి రామ్ కన్వార్ ప్రాతినిధ్యం వహించే రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ గ్రామం ఉన్నది.
కొన్నేళ్లుగా మేం తాగు నీరు, విద్యుత్, మొబైల్ టవర్లు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. కానీ, ప్రజాప్రతినిధులు మా గోడు వినిపించుకోవడం లేదు. కాబట్టి, ఈసారి ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని ఈ రెండు గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ ఎన్నికలను బహిష్కరించాలని పాంప్లెట్లు వేశారు. ఊరి శివారులో బ్యానర్లు కూడా పెట్టారు. ‘తాగు నీటి వసతి కోసం, విద్యుత్ సరఫరా కోసం, మొబైల్ టవర్లు, ఇతర కనీస అవసరాల కోసం సుదీర్ఘ కాలంగా మేం డిమాండ్ చేస్తున్నాం. కానీ, మా సమస్యలను ప్రజా ప్రతినిధులు పెడచెవిన పెడుతున్నారు’ అని ఈ సర్దిహ్ గ్రామానికి చెందిన సంతోష్ అన్నారు. సర్దిహ్, బగ్దరిదండ్, ఖుర్రిభౌనా, ఇతర సమీప గ్రామాల ప్రజలు ఇప్పటికీ అడవిలోని కుంటల్లోని నీరు తాగాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ గ్రామానికి రావడానికి రోడ్లు లేవని వివరించారు.
Also Read: జైలులోని ఖైదీకి గంజాయి తీసుకెళ్లుతూ పట్టుబడ్డ కానిస్టేబుల్
ఇక పై రాజకీయ నేతలు చేసే బూటకపు హామీలు చెల్లవని సంతోష్ అన్నారు. మరే గత్యంతరం లేక ఈ సారి ఎన్నికలను బహిష్కరించాలని గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు.
ఈ ఊళ్లలో ఏనుగులతోనూ ముప్పు ఉన్నది. సర్దిహ్, బగ్దరిదండ్ గ్రామాలకు విద్యుత్ రావడం లేదని, అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఓ బ్యానర్ ఊరి బయట పెట్టారు. దీని గురించి కొర్బా జిల్లా పంచాయత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశ్వదీప్ ముందు ప్రస్తావించగా.. తమకు ఈ విషయం తెలియవచ్చిందని, గ్రామాస్తుల ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా సర్దిచెప్పుతామని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.