ఇరాన్‌, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య మొద‌లైన ఉద్రిక్త‌త‌లు క్ర‌మంగా విస్త‌రిస్తున్నాయి. ఇరాన్‌లోని అణు కేంద్రాల‌పై అమెరికా దాడుల త‌ర్వాత ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇరాన్ కీలక నిర్ణ‌యం తీసుకుంది. 

అణు కేంద్రాలపై అమెరికా భారీ దాడులు

అమెరికా తాజాగా ఇరాన్‌పై చేపట్టిన "ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్‌" (Operation Midnight Hammer) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ వంటి కీలక అణు కేంద్రాలపై లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీగా బాంబుల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే.

శుక్రవారం అర్ధరాత్రి 7 బీ2 బాంబర్లు అమెరికా మిస్సోరీలోని వైమానిక స్థావరం నుంచి బయలుదేరాయి. ఇవి 14 బంకర్‌ బస్టర్‌ బాంబులతో పాటు, గాలిలో ఇంధనం నింపే ట్యాంకర్లు, గైడెడ్‌ క్షిపణుల జలాంతర్గామి, నిఘా విమానాలు, గూఢచర్య యంత్రాంగాలతో కలిసి మొత్తం 125 యుద్ధవిమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి.

18 గంట‌ల పాటు సాగిన ఆప‌రేష‌న్

ఈ ఆపరేషన్‌ ద్వారా అమెరికా అత్యంత కచ్చితమైన లక్ష్యాలను ఛేదించగలిగింది. మొత్తం మూడు అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. దాడిలో 75 కచ్చితమైన ఆయుధాలను వినియోగించారని అమెరికా వైమానిక దళాధిపతి డాన్ కెయిన్ తెలిపారు. ఈ భారీ సైనిక చ‌ర్య మొత్తం 18 గంటల పాటు సాగింది.

చ‌ర్చ‌ల‌కు తావేలేదు: ఇరాన్

ఇక అమెరికా దాడుల‌పై ఇరాన్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది. ఈ విష‌య‌మై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అమెరికాతో ఇక అణు చర్చలకు తావే లేదని తేల్చి చెప్పారు. త‌మ అణు స్థావరాలపై దాడి చేయడం ద్వారా అమెరికా అతి పెద్ద రెడ్‌లైన్ దాటింద‌న్నారు. వాషింగ్ట‌న్‌లోని అరాచ‌క ప్ర‌భుత్వం దీనికి తీవ్ర ప‌రిణామాల‌కు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

ర‌ష్యాతో భేటీ

ఇరాన్ తీరు చూస్తుంటే అమెరికాతో తాడోపేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మైన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌మ దేశాన్ని రక్షించుకోవడం త‌మ హ‌క్కు అని తెలిపిన అబ్బాస్ అరాగ్చీ తదుపరి చర్యల కోసం మాస్కో వెళ్లి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుస్తానని తెలిపారు. రష్యా మద్దతుతో సంయుక్త కౌంటర్ ఆపరేషన్ చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న వార్త ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

"ఇరాన్‌పై యుద్ధం కాదు" : అమెరికా రక్షణశాఖ

దాడుల తర్వాత అమెరికా రక్షణశాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ స్పందించారు. “ఇది పూర్తిగా అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్న దాడి. ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడానికి కాదు,” అని స్పష్టం చేశారు. “మేము ఈ దాడిని చాలా నెలలపాటు ప్రణాళికతో ముందుకు నడిపాం. శుక్రవారం రాత్రి మిస్సోరీ నుంచి విమానాలు గగనంలోకి ఎగిరాయి. ఫోకస్‌ మొత్తం అణు కేంద్రాలపైనే ఉంది. నాయకత్వ మార్పు మా ఉద్దేశం కాదు,” అని తెలిపారు.

ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, “ఇరాన్‌ను మళ్లీ అణు ఒప్పంద చర్చలకు రప్పించడానికే ఇది. శక్తివంతమైన సందేశం ఇచ్చాం,” అన్నారు.

"మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్ష‌: ట్రంప్

ఇరాన్‌పై జరిగిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో "మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్" అంటూ వ్యాఖ్యానించారు. “మేము చేపట్టిన దాడిలో అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా సైనికులు అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు,” అంటూ పొగిడారు.

ఇరాన్ అణు ప్రాజెక్టులు ప్రపంచ శాంతికి ప్రమాదకరమని, వాటిని నిరోధించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారంలో విదేశాంగ విధానంపై తీసుకున్న దృఢ వైఖరిని చాటుతున్నాయి.

పెరుగుతోన్న ఉద్రిక్త‌త‌లు

ఈ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా చర్యపై ఎలా స్పందిస్తాయన్నది కీలకం. అంతర్జాతీయ అణు పరిశోధన సంస్థ (IAEA) ఇప్పటికే ఇరాన్ అణు స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు జరిగిన దాడుల వల్ల అణు ఒప్పంద భవిష్యత్తు మరింత సంక్షోభంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాలు అమెరికా వైఖరికి మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నా, ఇతర మధ్యప్రాచ్య దేశాలు నిశ్చలంగా ఉన్నాయి. మరోవైపు రష్యా, చైనా, తుర్కీ లాంటి దేశాలు ఈ దాడులకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇది యుద్ధ తీవ్ర‌త పెరిగేందుకు అవ‌కాశాలు ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.