సల్మాన్ రష్దీపై దాడి చేసిన వ్యక్తిని ఇరాన్‌కు చెందిన ఓ సంస్థ ప్రశంసించింది. అంతేకాదు, అతడికి 1,000 చదరపు మీటర్ల భూమిని బహూకరిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక టీవీ చానెల్  టెలిగ్రామ్‌లో రిపోర్ట్ చేసింది. సల్మాన్ రష్దీ ఇప్పుడో జీవచ్ఛవం అని ఆ సంస్థ పేర్కొంది. 

న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై గతేడాది అమెరికాలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సల్మాన్ రష్దీకి ఒక కన్ను, ఒక చేయి పని చేయకుండా పోయాయి. ఆయన పై దాడి చేసిన వ్యక్తి హాది మతార్‌పై ఇరాన్‌కు చెందిన ఓ ఫౌండేషన్ ప్రశంసలు కురిపించింది. అంతేకాదు, ఆయన చేసిన ‘సాహస’ చర్యకు 1000 చదరపు మీటర్ల సాగు భూమిని బహూకరించే ప్రకటన చేసినట్టు ఇరాన్ అధికారిక టీవీ చానెల్ మంగళవారం దాని టెలిగ్రామ్ చానెల్‌లో రిపోర్ట్ చేసింది.

సల్మాన్ రష్దీ కంటిని, చేతిని పని చేయకుండా చేసిన ఆ అమెరికన్ యువకుడి సాహస చర్యకు తాము సిన్సెర్‌గా థాంక్స్ చెబుతున్నట్టు ఆ సంస్థ సెక్రెటరీ మొహమ్మద్ ఇస్మాయిల్ జరేయి పేర్కొన్నారు. ఆ చర్యతో ముస్లింలకు సంతోషాన్ని పంచారని తెలిపారు. రష్దీ ఇప్పుడు ఒక జీవచ్ఛవం మాత్రమే అని అన్నారు. ఆ యువకుడి ధైర్యమైన చర్యను గౌరవిస్తూ తాము 1000 చదరపు మీటర్ల సాగు భూమిని విరాళంగా ఇస్తామని తెలిపారు. ఆ యువకుడికి లేదా అతని లీగల్ రిప్రెజెంటేటివ్స్‌కు అయినా సరే బహూకరిస్తామని వెల్లడించారు.

గతేడాది ఆగస్టులో న్యూయార్క్‌లో లేక్ ఈరీ సమీపంలో చౌతౌక్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అనే అంశంపై ప్రసంగించడానికి సల్మాన్ రష్దీ వెళ్లారు. సల్మాన్ రష్దీ స్టేజీ మీద ఉన్నప్పుడు ఓ వ్యక్తి ప్రేక్షకుల్లో నుంచి స్టేజీ పైకి ఎక్కి రష్దీపై దాడికి దిగాడు. కత్తితో పొడిచాడు.

Also Read: కత్తి దాడి నుంచి ప్రాణాలతో బయటపడినా.. కంటి చూపును, ఓ చేయిని కోల్పొయిన సల్మాన్ రష్దీ..

ఇరాన్ గత సుప్రీమ్ లీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమెనీ ఇందుకు సంబంధించి ఓ ఫత్వా జారీ చేశాడు. రష్దీని చంపేయాలని అతను ఓ ఫత్వా ద్వారా ముస్లింలకు పిలుపు ఇచ్చాడు. ఈ పిలుపు ఇచ్చి 33 ఏళ్ల తర్వాత అమెరికాలోని హాది మతార్ సల్మాన్ రష్దీపై దాడి చేశాడు.

హాది మతార్ షియా తెగకు చెందిన ముస్లిం అమెరికన్. న్యూ జెర్సీలో నివసించేవాడు. అతని కుటుంబం లెబనాన్‌లోని యరూన్ పట్టణం నుంచి అమెరికాకు వచ్చింది. హాది మతార్ షియా ఎక్స్‌ట్రీమిజం, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ‌వైపు ఆకర్షితుడై ఉన్నట్టు అతని సోషల్ మీడియాలో ఖాతాల ద్వారా తెలిసినట్టు ఎన్‌బీసీ న్యూయార్క్ న్యూస్ ఔట్‌లెట్ పేర్కొంది.