ఇరాన్ వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఎలాంటి వీసా లేకుండా ఆ దేశానికి వెళ్లొచ్చు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో , ఇరాన్ - భారతదేశం మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడంలో కీలక ముందడుగును సూచిస్తుంది. 

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 4, 2024 నుండి భారత పౌరులకు వీసా నిబంధనలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న పౌరులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి 15 రోజుల పాటు ఎలాంటి వీసా లేకుండా ఇరాన్‌లోకి ప్రవేశించవచ్చని తెలిపింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న భారతీయ పౌరులు ఇకపై పర్యాటక ప్రయోజనాల కోసం ఇరాన్‌లోకి ప్రవేశించడానికి వీసా అవసరం లేదు. అయితే, ఇరాన్ అధికారులు తెలిపిన నిర్దిష్ట షరతులకు లోబడి భారతీయ పాస్‌పార్ట్ హోల్డర్స్ నడుచుకోవాల్సి వుంటుంది. 

తొలుత సాధారణ భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వ్యక్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా ఇరాన్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. అయితే, వారి బస ప్రతి సందర్శనకు గరిష్టంగా 15 రోజులకు పరిమితం . అలాగే ఈ వ్యవధిని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించలేరు. అలాగే వీసా రద్దు అనేది ఇరాన్‌లోకి ప్రవేశించే పర్యాటకులకు మాత్రమే వర్తిస్తుందని గమనించడం అవసరం. అందువల్ల ఎక్కువ కాలం పాటు ఉండాలనుకునే వ్యక్తులు, ఆరు నెలల వ్యవధిలో పలుమార్లు ఇరాన్‌కు ప్రయాణించాలనుకునే వ్యక్తులు, పర్యాటకం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం పలు రకాల వీసాలు అవసరమయ్యే వ్యక్తులు తప్పనిసరిగా భారతదేశంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మిషన్‌ల ద్వారా అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పొందాలి. .

Scroll to load tweet…

అంతేకాకుండా, ఈ ప్రకటనలో పేర్కొన్న వీసా మినహాయింపు వైమానిక సరిహద్దుల ద్వారా ఇరాన్‌లోకి ప్రవేశించే భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. భూ సరిహద్దుల వంటి ఇతర ప్రవేశ మార్గాల ద్వారా వచ్చే ప్రయాణికులు వేర్వేరు నిబంధనలు , ఇతర వీసా పరిమితులకు లోబడి ఉండవచ్చు. ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో , ఇరాన్ - భారతదేశం మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడంలో కీలక ముందడుగును సూచిస్తుంది. అలాగే ఇది సాంస్కృతిక మార్పిడిని మెరుగుపరచడం, ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించడం, భారతదేశం నుండి ఇరాన్‌కు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.