కెనడాలో భారతీయ వీసా సేవలు నిలిపివేత.. : దౌత్యపరమైన సంక్షోభం వేళ భారత్ కీలక నిర్ణయం..
భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారతదేశం నిలివేసింది.

ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్‌కు సంబంధం ఉన్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై అంతర్జాతీయంగా భారీ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను భారత్ బలంగా తిరస్కరించింది. అయితే భారత్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి కెనడాకు అంతగా మద్దతు లభించడం లేదు. మరోవైపు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడ పౌరులకు వీసాల జారీని భారతదేశం నిలివేసింది.
తదుపరి నోటీసు వరకు వీసా జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టుగా తెలిపింది. ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ సెంటర్ అయిన బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ నోటీసులో ‘ఆపరేషన్ రీజన్స్’ వల్ల వీసా సేవలు నిలిపివేయబడ్డాయని పేర్కొంది. దయచేసి తదుపరి నవీకరణల కోసం బీఎల్‌ఎస్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలని ఇండియా వీసా అప్లికేషన్ సెంటర్ కెనడా పేర్కొంది.
ఇదిలాఉంటే, భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో మరో గ్యాంగ్‌స్టర్ హత్య జరిగింది. ఖలిస్తాన్ వేర్పాటువాది సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా దునేకే దారుణ హత్యకు గురయ్యాడు. పంజాబ్ లోని మోగా జిల్లాకు చెందిన అతడు కెనడాలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతడు మోగా జిల్లాలోని దవీందర్ బాంబిహా గ్యాంగ్ కు చెందిన గ్యాంగ్ స్టర్‌గా గుర్తింపు పొందాడు. అతడు కెనడాలోని విన్నిపెగ్‌లో ఆయన హత్యకు గురయ్యాడని కథనాలు వెలువడుతున్నాయి. అయితే రెండు నెలల క్రితం ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ఈ హత్యకు పోలికలు ఉన్నాయని చెబుతున్నారు.
సుఖ్దూల్ సింగ్ 2017లో భారత్ నుంచి కెనడాకు పారిపోయాడు. అతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతడు ఖలిస్తాన్ వేర్పాటువాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష్ దాలాకు సహాయకుడని కొన్ని వార్తా కథనాలు చెబుతున్నాయి. ఖలిస్థాన్ సంస్థల వైపు మొగ్గు చూపుతూ సుపారీ హత్యలకు పాల్పడినట్లు కూడా తెలుస్తోంది. అతడు నకిలీ పాస్ పోర్టుతో వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.