బౌద్ధ విలువను భారత ప్రజలు అంగీకరించి.. ప్రచారం చేస్తున్నారని భారత రష్యా అంబాసిడర్ పవన్ కుమార్ తెలిపారు. రష్యాలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌లోని బౌద్ధమతానికి, రష్యాలో ఆచరిస్తున్న బౌద్ధమతానికి ఉన్న సారూప్యాన్ని పరిశీలించాలని వివరించారు. భౌగోళిక సరిహద్దులను కాదని, ఆధ్యాత్మిక వారసత్వం ఉభయ దేశాలను ఏకం చేస్తున్నదని తెలిపారు. 

న్యూఢిల్లీ: బౌద్ధ మతం విలువలు, సాంప్రదాయాలను భారత్ ఆమోదిస్తుందని, వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుందని రష్యాకు భారత అంబాసిడర్ పవన్ కపూర్ శుక్రవారం వెల్లడించారు. ‘భారత దేశ సమాజానికి మూలస్తంభంగా బుద్ధిజం శతాబ్దాలుగా కొనసాగుతున్నది. బౌద్ధం కరుణ, విజ్ఞానం, శాంతి, సామరస్యాన్ని బోధిస్తుంది. బుద్ధుడి విజ్ఞాన కాంతి తొలిగా భారత్‌లోనే ప్రసరించింది. భారత్ ఆయన బోధనలను అంగీకరించింది. ఆ తర్వాత ఇతర దేశాలకూ వ్యాపించింది. రష్యాలోనూ బౌద్ధాన్ని ఆచరిస్తున్నారు. రష్యాలో గుర్తింపు పొందిన నాలుగో అతిపెద్ద మతం బుద్ధిజమే’ అని అంతర్జాతీయ బుద్ధిస్టు ఫోరమ్‌ను ఉద్దేశించి పవన్ కపూర్ మాట్లాడారు.

రష్యాలోని ఉలన్ ఉదేలో బౌద్ధంపై అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. పండితో ఖాంబో లామా, బుర్యతియా హెడ్ అలెక్సీ సెడెనోవ్, ఇతర ప్రముఖులు హాజరైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్, రష్యాల మధ్య ఆధ్యాత్మిక బంధాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని ఆయన అన్నారు.

‘బుద్ధిజం దారంతో మన ఉమ్మడి ఆధ్యాత్మికత కుట్టబడి ఉన్నది. భౌగోళిక సరిహద్దులను దాటి సాంస్కృతికంగా ఇది మన ఉభయ దేశాలను ఏకం చేస్తున్నది. ఇండో, హిమాలయాన్ బౌద్ధానికి, రష్యాలో అనుసరిస్తున్న బౌద్ధమతానికి మధ్య సారూప్యతలను పరిశీలించాల్సి ఉన్నది’ అని పవన్ కుమార్ చెప్పారు.

Also Read: Pakistan: ఇమ్రాన్ ఖాన్‌ను తిరస్కరిస్తే.. అనివార్యంగా సైనిక పాలనను ఆహ్వానించడమే!

బుద్ధిజ ఇండియా నుంచి టిబెట్‌కు ఆ తర్వాత ఇంకా విస్తరించి పోయిన సందర్భాల్లో మన ఉమ్మడి ఆధ్యాత్మిక మూలాలను వెతుక్కోవచ్చని పవన్ కుమార్ వివరించారు. భారత్ కూడా బౌద్ధానికి పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. బుద్ధిస్ట్ టూరిజం సర్క్యూట్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2022 మే 16న(బుద్ధ జయంతి) నేపాల్‌లో సిద్ధార్థ గౌతముడి జన్మస్థలమైన లుంబినిలో ఈ చారిత్రక ప్రాజెక్టుకు భారత, నేపాల్ ప్రధానులు ఉమ్మడిగా శంకుస్థాపన చేశారు.

‘మన ఉమ్మడి ప్రయాణంలో ఉమ్మడి వారసత్వ విలువల నుంచి ప్రేరణ పొందాల్సి ఉన్నదని పవన్ కుమార్ తెలిపారు. గతకాలపు ఘనమైన వారసత్వాన్ని స్మరిస్తూ ఉభయ దేశాలు చేతిలో చేయి వేసుకుని పురోగమించి మన జీవితాలను ప్రకాశవంతం చేసుకోవాలి’ అని అన్నారు. అనంతరం, ఆయన శుక్రవారం ఇందుకు సంబంధించి ట్వీట్ చేశారు.