కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో హిందూ దేవాలయంపై దాడి చేశారు. కొందరు దుండగులు భారతీయులకు వ్యతిరేకంగా రాతలు రాసి ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. దేవాలయం గోడల మీద భారత్‌కు వ్యతిరేకంగా రాతలు రాశారని తెలిసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దేవాలయాలకు తగిన భద్రత కల్పించాలని భారత్ కోరింది. ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) Xలో ఒక ప్రకటన విడుదల చేసింది, ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది, న్యాయం జరగాలని డిమాండ్ చేసింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ చర్యను "హేయమైనది"గా అభివర్ణించారు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని, మతపరమైన ప్రదేశాలకు భద్రత కల్పించాలని ఆయన స్థానిక అధికారులను కోరారు.
"కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో ఒక హిందూ దేవాలయంలో విధ్వంసం జరిగినట్లు మాకు తెలిసింది. ఇలాంటి హేయమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని స్థానిక అధికారులను కోరుతున్నాం" అని MEA Xలో పోస్ట్ చేసింది. ఈ ఘటన చినో హిల్స్‌లోని BAPS హిందూ దేవాలయంలో జరిగింది. కొందరు దుండగులు రెచ్చగొట్టే సందేశాలతో దేవాలయాన్ని ధ్వంసం చేశారు. లాస్ ఏంజిల్స్‌లో వివాదాస్పద 'ఖలిస్తానీ రిఫరెండం' జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ దాడి జరిగింది.
"చినో హిల్స్‌లో మరో దేవాలయాన్ని ధ్వంసం చేసినా, హిందూ సమాజం ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడుతుంది. చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని సమాజంతో కలిసి, ద్వేషాన్ని ఎప్పటికీ పెరగనివ్వము. మనలోని మానవత్వం, విశ్వాసం శాంతి, కరుణను కాపాడతాయి" అని BAPS పబ్లిక్ అఫైర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఉత్తర అమెరికాలోని హిందువుల కూటమి (CoHNA) కూడా ఈ దాడిని ఖండించింది. ఇది గతంలో అమెరికాలో జరిగిన దేవాలయ విధ్వంసాలకు కొనసాగింపుగా అభివర్ణించింది. "మరో హిందూ దేవాలయం ధ్వంసం అయింది - ఈసారి చినో హిల్స్‌లోని ప్రసిద్ధ BAPS దేవాలయం. మీడియా, విద్యావేత్తలు హిందూ వ్యతిరేక ద్వేషం లేదని, #హిందూఫోబియా అనేది మన ఊహ మాత్రమే అని పట్టుబట్టే ప్రపంచంలో ఇది మరో రోజు. LAలో 'ఖలిస్తాన్ రిఫరెండం' దగ్గర పడుతున్న సమయంలో ఇది జరగడం ఆశ్చర్యం కలిగించదు" అని CoHNA Xలో పోస్ట్ చేసింది.
గత సంవత్సరం సెప్టెంబర్ 25న కాలిఫోర్నియాలోని BAPS శ్రీ స్వామినారాయణ్ మందిర్‌ను కూడా ధ్వంసం చేశారు. దీనికి 10 రోజుల ముందు న్యూయార్క్‌లోని BAPS మందిర్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ ఘటనల్లో దేవాలయాల గోడలపై "హిందువులు వెనక్కి వెళ్లండి" వంటి హిందూ వ్యతిరేక సందేశాలు కనిపించాయి. ఇది మత అసహనం పెరుగుతోందనే ఆందోళనను రేకెత్తిస్తోంది.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అమెరికా అధికారులు గట్టిగా స్పందించాలని భారత అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల్లో ఇది మరొకటి. ఇది అమెరికాలోని భారతీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. భారత ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తుంటే, ఇలాంటి దాడుల విషయంలో భారత్ చాలా సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ఎలా పరిష్కరిస్తారో భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.
