ఉగ్రవాదులు కెనడాలో సురక్షిత స్వర్గధామం కనుగొన్నారు.. శ్రీలంక విదేశాంగ మంత్రి
భారత్-కెనడా దౌత్య వివాదంపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు. ఉగ్రవాదులు కెనడాలో సురక్షిత స్థావరాన్ని కనుగొన్నారని సంచలన కామెంట్స్ చేశారు.

భారత్-కెనడా దౌత్య వివాదంపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు. ఉగ్రవాదులు కెనడాలో సురక్షిత స్థావరాన్ని కనుగొన్నారని సంచలన కామెంట్స్ చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎటువంటి రుజువు లేకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ట్రూడో దౌర్జన్యమైన, నిరూపించబడని ఆరోపణలు చేస్తూనే ఉన్నందున.. అతని వ్యాఖ్యలపై తాను ఆశ్చర్యం చెందడం లేదని కూడా సబ్రీ అన్నారు.
అలీ సబ్రీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది ఉగ్రవాదులు కెనడాలో సురక్షిత ఆశ్రయం పొందారు. కెనడా ప్రధాని ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని దారుణమైన ఆరోపణలతో బయటకి వస్తున్నారు. శ్రీలంక విషయంలోనూ వారు ఇలాగే చేశారు. శ్రీలంకలో మారణహోమం జరిగిందనేది భయంకరమైన పూర్తి అబద్ధం. మా దేశంలో మారణహోమం జరగలేదని అందరికీ తెలుసు.
నిన్న నేను చూశాను.. అతను వెళ్లి రెండవ ప్రపంచ యుద్ధంలో గతంలో నాజీలతో సంబంధం ఉన్న ఒకరికి అద్భుతమైన స్వాగతం పలికాడు. కాబట్టి ఇది సందేహాస్పదంగా ఉంది. మేము గతంలో ఇలాంటి వాటిని ఎదుర్కొన్నాం. కొన్నిసార్లు కెనడా ప్రధాని ట్రూడో దారుణమైన, నిరూపించబడని ఆరోపణలతో బయటకు రావడం చూసి నేను ఆశ్చర్యపోను’’ అని పేర్కొన్నారు.
ఇక, శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ భారతదేశం, శ్రీలంక మధ్య మత్స్యకారుల సమస్య గురించి మాట్లాడుతూ.. తాము ఈ సమస్యను కూర్చుని చర్చిస్తామని చెప్పారు. భారత్, శ్రీలంక దేశాలకు చాలాసార్లు కలిసి కూర్చుని తమ సమస్యలపై చర్చించుకున్న చరిత్ర ఉంది. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక, కెనడాలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చిచంపిన ఘటనలో భారత్ ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో సెప్టెంబర్ 18న ఆరోపించారు. ఈ క్రమంలోనే భారత్ కూడా ధీటుగా రియాక్ట్ అయింది. ట్రూడో ఆరోపణలను అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని అని భారత్ తిరస్కరించింది.ఈ నేపథ్యంలోనే భారత్-కెనడాల మధ్య దౌత్య వివాదం నెలకొంది.