ఇండియా-భారత్ : పేరు మార్పుపై కాదు.. ఆర్థిక వ్యవస్థ సంస్కరణలపై దృష్టి పెట్టండి - భారతదేశానికి చైనా సలహా..
ఇప్పుడు భారతదేశం పేరు మార్పు కంటే మరింత ముఖ్యమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించాలని చైనా సలహా ఇచ్చింది. జీ20 సదస్సును ఆర్థిక వ్యవస్థను సంస్కరించుకోవడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించుకోవడానిక ఉపయోగించుకోవాలని సూచించింది.

ఇండియా టు భారత్ పేరు మార్పుపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై అనేక వర్గాల నుంచి భిన్న ప్రతిస్పందనలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు దీనిపై తమ వైఖరిని వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో మన దేశ అంతర్గత వ్యవహారంలోకి చైనా దిగింది. ఇండియా-భారత్ పేరు మార్పుపై జరుగుతున్న చర్చపై స్పందించింది. దీనిపై చైనా మౌత్ పీస్ ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక గురువారం ఒక అభిప్రాయాన్ని ప్రచురించింది. పేరు మార్చడంపై కాకుండా మరింత ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని భారతదేశానికి సలహా ఇచ్చింది.
‘‘భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను సంస్కరించడానికి, దాని బహిరంగతను విస్తరించడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, విదేశీ పెట్టుబడిదారులకు న్యాయమైన వ్యాపార వాతావరణాన్ని అందించడానికి తన సంకల్పాన్ని ప్రదర్శించడానికి జీ 20 అధ్యక్ష పదవిని ఉపయోగించాలి. క్రమంగా ఈ చర్యలను అమలు చేయాలి. దేశం పేరును మార్చాలా వద్దా అనే దానికంటే ఇవన్నీ చాలా ముఖ్యం’’ అని గ్లోబల్ టైమ్స్ నివేదిక మన దేశానికి సలహా ఇచ్చింది. కాగా.. దీనిపై భారత ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది.
జీ-20 ఆహ్వానాల్లో నరేంద్ర మోడీని భారత ప్రధానిగా, ద్రౌపది ముర్మును భారత్ అధ్యక్షురాలిగా ప్రస్తావించడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. దీనికితోడు రానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భారత్ పేరును అన్ని అధికారిక అవసరాల కోసం భారత్ గా నామకరణం చేసే తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ‘ఇండియా’ కూటమికి భయపడుతోందంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.
భారతదేశ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుండి 10 వరకు దేశ రాజధానిలో ఢిల్లీలో జీ-20 సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఇందులో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులకు జీ-20 విందును ఇవ్వనున్నారు.