Asianet News TeluguAsianet News Telugu

రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్.. ఓటింగ్‌‌కు దూరంగా భారత్.. పాక్‌ ఆరోపణలకు గట్టి కౌంటర్..

ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, ఖెర్సన్, లుహాన్స్క్, జపోరిజ్జియా రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ప్రతిపాదించిన తీర్మానానికి.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. 

India Abstains From UN Vote Condemning Russias Annexation Of Ukraine places
Author
First Published Oct 13, 2022, 11:44 AM IST

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, ఖెర్సన్, లుహాన్స్క్, జపోరిజ్జియా రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ప్రతిపాదించిన తీర్మానానికి.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 143 దేశాలు ఓటు వేయగా.. ఐదు దేశాలు(రష్యా, బెలారస్, ఉత్తర కొరియా, సిరియా, నికరాగ్వా) వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్,  పాకిస్తాన్, చైనా సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అయితే అత్యధిక దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొందింది. 

సెప్టెంబర్ చివరి వారంలో క్రెమ్లిన్‌లో జరిగిన ఒక వేడుకల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తూర్పు ఉక్రేనియన్ ప్రాంతాలైన లుహాన్స్క్, డొనెట్స్క్, జపోరిజ్జియా, ఖెర్సన్‌లను రష్యాలో భాగంగా చేయడానికి అవసరమైన పత్రాలపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ఆ నాలుగు ప్రాంతాల నాయకులు కూడా సంతకాలు చేశారు. 

ఇక, ఈ వారం క్రిమియా వంతెన పేలుడు తర్వాత రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. దీని వెనక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపించింది. ఈ క్రమంలోనే తీవ్ర ప్రతీకార చర్యలు తప్పవని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు నగరాలపై రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరోసారి భయానకంగా మారాయి. రష్యా దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు మృతిచెందారు.  

 


ఇదిలా ఉంటే.. రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉండటంపై ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధంలో మానవ ప్రాణాలను పణంగా పెట్టి ఎటువంటి పరిష్కారాన్ని సాధించలేమని భారత్ అభిప్రాయపడిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘శత్రుత్వాల తక్షణ విరమణ.. చర్చలు, దౌత్య మార్గానికి అత్యవసరంగా తిరిగి రావడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని మేము కోరాము. వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. యుద్ధం కారణంగా "మొత్తం గ్లోబల్ సౌత్" గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువుల సరఫరాపై సంఘర్షణ యొక్క పరిణామాలను ఎదుర్కొంటున్నందున..  గ్లోబల్ సౌత్ వాయిస్ వినిపించడం,  వారి న్యాయబద్ధమైన ఆందోళనలను సరిగ్గా పరిష్కరించడం చాలా క్లిష్టమైనది’’ అని ఆమె అన్నారు. 

ఉక్రెయిన్‌లోని పరిస్థితిని జమ్మూ కాశ్మీర్‌తో పోల్చుతూ పాక్ ప్రతినిధి మునీర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ ప్రతినిధి వ్యాఖ్యలు..  పనికిరానివి, అర్ధంలేనివి అని అన్నారు. జమ్మూ  కాశ్మీర్ మొత్తం భూభాగం భారత దేశంలో అంతర్భాగంగా ఉందని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ చేసినటువంటి ప్రకటనలు.. పదేపదే తప్పుడు మాటలు చెప్పే మనస్తత్వం పట్ల సానుభూతికి అర్హమైనవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios