Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. బంగ్లాదేశ్‌లో హిందూ యువతి హత్య.. చంపి, ముక్కలుగా నరికిన ప్రేమికుడు..

బంగ్లాదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ హిందూ యువతిని ప్రేమ పేరుతో ఇంటికి పిలిచిన ఓ యువకుడు.. ఆమెను చంపి, ముక్కలుగా నరికేశాడు. ఆ తరువాత ఇంటికి తాళం వేసి, పారిపోయాడు.

Hindu girl chopped into pieces by lover in Bangladesh
Author
First Published Nov 19, 2022, 9:39 AM IST

బంగ్లాదేశ్ : ఢిల్లీలో సంచలనం రేపి శ్రద్ధావాకర్ హత్య కేసులాంటిదే.. అచ్చు అలాగే బంగ్లాదేశ్ లో ఓ హత్య వెలుగుచూసింది. ప్రియురాలిని ఇంటికి పిలిచి, హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా కోసి.. బయటపడేశాడు ఓ వ్యక్తి. అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధావాకర్ కేసుతో ఈ కేసుకు అనేక పోలికలు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ లో.. అబూ బకర్ అనే వ్యక్తి కవితా రాణి అనే అమ్మాయిని కలుసుకున్నాడు. ఆమెతో ప్రేమలో పడ్డాడు, ఆ తరువాత ఇంటికి పిలిచి, ఆమెను చంపి ముక్కలుగా నరికాడు. మే 18న ఢిల్లీలో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా చేత గొంతుకోసి 35 ముక్కలుగా నరికేసిన శ్రద్ధా వాకర్ హత్యకు ఈ కేసుకు పోలికలు ఉండడం వింతగా ఉంది.

నవంబర్ 6న, అబూ బకర్ ఉద్యోగానికి రాలేదు. ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో అతను పనిచేస్తున్న రవాణా సంస్థ యజమాని బకర్ అద్దె ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. అయితే ఇంటికి బయట నుండి తాళం వేసి ఉంది. అబూబకర్ అదృశ్యంపై అనుమానం పెరగడంతో, యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి అతని ఇంటి తలుపులు తెరిచి చూడగా, ఇంట్లో అనుమానాస్పదంగా ఒక పెట్టె కనిపించింది. అందులో తల లేని మహిళ మృతదేహం కనిపించింది. ఆమె తలను పాలిథిన్‌ కవర్ లో చుట్టి వేరుగా ఉంచారు. చేతులు మాత్రం దొరకలేదు. బాధితురాలిని కాళీపాడ్ బాచర్ల కుమార్తె కవితా రాణిగా గుర్తించారు.

పరువు హత్య : చంపి, జననాంగాలు కోసి.. రాజస్థాన్ లో జంట దారుణ హత్య..

ఆ తరువాత నవంబర్ 7న, అబూ బకర్‌తో పాటు అతనితో సహజీవనంలో ఉన్న సప్నాను పోలీసులు పట్టుకున్నారు. దీనిగురించి బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అధికారి మాట్లాడుతూ అబూ బకర్, సప్నా గత నాలుగు సంవత్సరాలుగా గోబర్చక స్క్వేర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. సప్నాతో రిలేషన్ లో ఉంటూనే.. ఇటీవల అబూబకర్‌ కవితతో ప్రేమలో పడ్డాడు.  తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి ముక్కలుగా నరికాడు. అయితే, ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. హత్యకు ఐదు రోజుల ముందు మాత్రమే వీరిద్దరూ కలుసుకున్నారు. 

నవంబరు 5న సప్నా ఉద్యోగానికి వెళ్లిన సమయంలో కవితను అబూ బకర్ తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడ, ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. కోపంతో బకర్ ఆమెను గొంతు కోసి చంపాడు. ఆ తరువాత శరీరం నుండి తలను వేరు చేశాడు. మొండెం చేతులను నరికి కాలువలో పడేశాడు. తలను పాలిథిన్ సంచిలో చుట్టి పెట్టాడు. మిగిలిన మృతదేహాన్ని బాక్సులో పెట్టి పారిపోయాడు.

అదే రోజు రాత్రి అబూ బకర్ తన లివ్-ఇన్ భాగస్వామి సప్నాతో కలిసి రూప్సా నదిని దాటి ఢాకాకు బయలుదేరినట్లు ఆర్ఏబీ అధికారి వెల్లడించారు. అయితే, హత్య జరిగిన మరుసటి రోజు అతని ఇంట్లో కవితా రాణి మృతదేహాన్ని కనుగొనడంతో పోలీసులు అబూ బకర్ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దీంతో పోలీసులు, ఆర్ఏబీ ఇంటెలిజెన్స్ నవంబర్ 6 రాత్రి నిందితుడు అబూ బకర్ ఆచూకీని కనిపెట్టారు. 

ఆ తర్వాత ఘాజీపూర్ జిల్లా బసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌరస్తా ప్రాంతం నుండి అతడిని, సప్నాను అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడిని సోనాదంగ పోలీస్ స్టేషన్‌ లో అప్పగించారు. కస్టడీలో అబూ బకర్ నేరాన్ని అంగీకరించాడు. నగరంలోని గోబర్‌చాకా ప్రాంతంలోని ఓ ప్రదేశంలో పాలిథిన్‌ కవర్ లో చుట్టిన కవిత చేతులను ఆర్ఏబీ స్వాధీనం చేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios