బ్రెజిల్ దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెర్నాంబుకో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల దాదాపు 28 మంది చనిపోయారు. ఈ వర్షాల వల్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి.
బ్రెజిల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం ఆ దేశ పౌరులపై ఎంతోగానో పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్థంభించిపోతోంది. అయితే ఈ వర్షాల వల్ల ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలోని మెట్రోపాలిటన్ ప్రాంతమైన రెసిఫేలో 28 మంది చనిపోయారు. మొత్తంగా 33 మంది మరణించారు ఈ విషయాన్ని వార్తా సంస్థ AFP తెలిపింది.
లగ్జరీ సూపర్‌యాచ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. యూకేలో ఘటన.. వీడియో వైరల్
మంగళవారం నుంచి మొదలైన వర్షం... ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అయితే వర్షం ప్రభావం వల్ల గడిచిన 24 గంటల్లో 28 మంది మరణించినట్లు సివిల్ డిఫెన్స్ తెలిపింది. రెసిఫె, జాబోటావో డోస్ గ్వారారాప్స్ మునిసిపాలిటీ మధ్య సరిహద్దులో ఉన్న జార్డిమ్ మోంటెవెర్డే కమ్యూనిటీలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 19 మంది మరణించినట్లు సమాచారం. ఎఎఫ్ పీ తెలిపిన వివరాల ప్రకారం.. కమరగిబే మునిసిపాలిటీలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణించగా, రెసిఫ్ లో ఇద్దరు, జాబోటావో డోస్ గురారాప్స్ లో ఒకరు చనిపోయారు.
అయితే వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల, సుమారు 1,000 మంది ప్రజలు తమ ఇళ్ల నుండి నిరాశ్రయులయ్యారు. పెర్నాంబుకో వాటర్ అండ్ క్లైమేట్ ఏజెన్సీ రాష్ట్రంలో రాబోయే 24 గంటల పాటు భారీ వర్షపాత హెచ్చరికను జారీ చేసింది. వరదల కారణంగా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడానికి రెసిఫ్ లో పాఠశాలలు తెరిచారు. పరైబా, రియో గ్రాండే డో నార్టే, అలగోవాస్ సహా ఈశాన్య బ్రెజిల్ తీరంలోని పలు ఇతర రాష్ట్రాల్లో బ్రెజిల్ జాతీయ వాతావరణ అథారిటీ ఐఎన్ఎంఈటీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో వారం పొడవునా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అలగోస్లోని 33 మున్సిపాలిటీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. మన దేశంలో అస్సాంను కూడా వర్షాలు వదలడం లేదు. దీని వల్ల వరద పోతెట్టుతోంది. ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన డేటా ప్రకారం వరద వల్ల ఇప్పటి వరకు 30 మంది మరణించారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నాగావ్, కాచర్, మోరిగావ్, డిమా హసావో, గోల్‌పరా, గోలాఘాట్, హైలకండి, హోజాయ్, కమ్‌రూప్, కమ్రూప్ (మెట్రో), కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, సోనిత్‌పూర్ 12 జిల్లాల్లోని దాదాపు 5.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని అధికారులు చెప్పారు.
ఈ వర్షాలు, వరదల వల్ల నాగావ్ జిల్లాలో 3.68 లక్షల మందికి పైగా ప్రభావితం అయ్యారు. అలాగే కాచర్ లో దాదాపు 1.5 లక్షల మంది, మోరిగావ్ లో 41,000 మందికి వరదల దాటికి గురయ్యారు. కాగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT) రాష్ట్రానికి చేరుకొని పని ప్రారంభించింది. ముందస్తు వరదలు, కొండచరియలు అస్సాంలోని పెద్ద ప్రాంతాలను ప్రభావితం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 47,139.12 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అధికార యంత్రాంగం తెలిపింది.
