హమాస్ కిడ్నాప్ చేసి గాజాలో ఊరేగించిన జర్మనీ యువతికి చిత్ర హింసలు, ఆమె మృతదేహం లభ్యం
ఇజ్రాయెల్ సరిహద్దు దాటి లోనికి చొచ్చుకువచ్చి అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడుల్లో ఓ మ్యూజిక్ ఫెస్టివల్ రక్తసిక్తమైన సంగతి తెలిసిందే. ఆ మ్యూజిక్ ఫెస్టివల్‌కు అటెండ్ అయిన జర్మనీకి చెందిన యువతి, టాట్టూ ఆర్టిస్ట్ కనిపించకుండా పోయింది. హమాస్ ఉగ్రవాదులు ఆమెను గాజాలో ఊరేగించారు. తాజాగా ఆమె మృతదేహం లభించినట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది.
న్యూఢిల్లీ: జర్మనీ టాట్టూ ఆర్టీస్ట్‌ను అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌లో జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసుకుని గాజాకు తీసుకెళ్లారు. గాజాలో ఆమెను ఊరేగించి చిత్ర హింసలు పెట్టారు. తాజాగా, ఆ జర్మనీ యువతి మృతదేహం లభించినట్టు ఇజ్రాయెల్ సోమవారం వెల్లడించింది.
అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్ సరిహద్దులోకి చొచ్చుకుని వచ్చి మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 200 వరకు పౌరులను అపహరించుకుని తీసుకెళ్లి బందీలుగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు ట్రైబ్ ఆప్ సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్ రక్తసిక్తమైంది. హమాస్ ఉగ్రవాదులు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ పై కాల్పులతో విరుచుకుపడి రక్తాలు పారించారు.
ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌కు వచ్చిన జర్మనీకి చెందిన టాట్టూ ఆర్టిస్ట్ షాని లౌక్ కనిపించకుండా పోయారు. ఆమె కజిన్ తొమసిన వెంట్రబ్ లౌక్ ఆమె కనిపించడం లేదని తొలిగా రిపోర్ట్ చేశారు. ఆమె తల్లి రికార్డా లౌక్ తన బిడ్డ గురించి సమాచారం తెలిసిన వారు తనకు చెప్పాలని ఓ వీడియో మెస్సేజీలో కోరారు.
Also Read: సైనిక దాడిని విస్తృతం చేసిన ఇజ్రాయెల్.. గాజాలో 8 వేలకు చేరిన మరణాలు..
షానిని మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. గాజాలో ఆ ఉగ్రవాదులు ఆమెను ఊరేగించారు. ఎంతో చిత్రవధ ఎదుర్కొన్న షాని మరణించింది. ఆమె డెడ్ బాడీ లభించింది. మా గుండెలు పగిలాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ ట్వీట్‌లో పేర్కొంది.
మ్యూజిక్ ఫెస్టివల్ పై దాడి జరిగిన కొన్నాళ్లకు ఆమె తల్లి ఓ వీడియో మెస్సేజీలో షాని గురించి మాట్లాడారు. షాని బతికే ఉన్నదని, ఓ హమాస్ హాస్పిటల్‌లో ఉన్నదని తమకు గాజాలోని ఓ మిత్రుడు చెప్పారని వివరించారు. ‘షాని ఇప్పుడు బతికే ఉన్నట్టు మాకు సమాచారం అందింది. కానీ, ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రతి నిమిషం క్రిటికల్‌గానే ఉన్నది. కాబట్టి, వెంటనే తమ బిడ్డను కాపాడే ప్రయత్నాలు చేయాలని జర్మనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని రికార్డా పేర్కొన్నారు.