68వ అంతస్తు నుండి పడి ఫ్రాన్స్ కు చెందిన డేర్‌డెవిల్ రెమి లూసిడి మృతి..
రెమి లూసిడి 30 ఏళ్ల ఫ్రెంచ్ డేర్‌డెవిల్.. 68అంతస్తుల హాంకాంగ్ రెసిడెన్షియల్ నుంచి కిందికి దూకే సాహసం చేస్తూ.. ప్రమాదవశాత్తూ కిందపడి మరణించాడు.

హాంకాంగ్ : రెమీ లుసిడి… అత్యంత ఎత్తైన భవనాలను నేర్పుగా అధిరోహించే సాహసి. పాములు పెంచేవాడు పాముకాటుతోనే మరణించినట్లుగా… అతి సునాయాసంగా అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించి వావ్ అనిపించిన రెమిలూసిడి… ఆ భవనం నుంచే పడి మృత్యువాత పడ్డారు. 30 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఈ ఫ్రాన్స్ సాహసి ప్రమాదవశాత్తు మరణించడం విషాదం.
ఫ్రాన్స్ కు చెందిన రెమీ లుసిడికి ప్రమాదాలతో ఆటలాడుకోవడం సరదా. ఆ సరదాలో భాగంగానే ఓ సాహసం చేయబోయాడు. ఈ క్రమంలో 68 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన హాంకాంగ్లో చోటుచేసుకుంది. హాంకాంగ్లో ఉన్న ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ ను ఎక్కాలని లూసిడి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. ఇలా పడడానికి ముందు 68వ ఫ్లోర్లో ఉన్నపెంట్ హౌస్ కిటికీ బయట చిక్కుకున్నాడు,
టూరిస్ట్ విమానం ఇంజిన్ లో సమస్య.. సముద్రంలో ల్యాండ్ చేసిన పైలెట్.. చివరికి..
దూకే క్రమంలో కిటికీ బయట చిక్కుకుపోవడంతో భయంతో కిటికీని బలంగా తన్నాడు. కిటికీ బయట అతడిని చూసిన పెంట్ హౌస్ లోని పనిమనిషి ఆశ్చర్యపోయింది. కిటికీని తన్నిన కాసేపటికి అతడి కాలు అక్కడి నుంచి పట్టుతప్పి నేరుగా కిందపడిపోయాడు. ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. దీనికి సంబంధించి హాంకాంగ్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సోమవారం ఉదయం 6:00 సమయంలో రెమీ లుసిడి ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ బిల్డింగ్ సెక్యూరిటీ వద్దకు చేరుకున్నాడు. తన మిత్రుడు 40వ అంతస్తులో ఉన్నాడని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత ఫోన్ చేసిన సెక్యూరిటీకి 40 అంతస్తులు ఉన్న వ్యక్తి… లుసిడి ఎవరో తనకు తెలియదని చెప్పాడు.
వెంటనే అతడిని ఆపడానికి చూసిన సెక్యూరిటీకి లుసిడి ఎలివేటర్ లో పైకి వెళ్లడం కనిపించింది. ఆ తర్వాత 49వ ఫ్లోర్లో దిగి అక్కడి నుంచి మెట్ల మార్గంలో పైకి వెళ్ళాడు. ఈ విషయాన్ని అక్కడ చూసినవారు తెలిపారు. అంతే తప్ప భవనంపై కప్పు పై ఎక్కడం తాము చూడలేదని పేర్కొన్నారు. అయితే, ఉదయం 7:38 సమయంలో పెంట్ హౌస్ లో పనిచేస్తున్న పనిమనిషి అతడిని చూసింది.
వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత కొద్ది సెకండ్లలోనే లుసిడి పట్టు తప్పి కింద పడిపోయాడు. అయితే, దీనిమీద విచారణ చేపట్టిన పోలీసులు… పైనుంచి దూకే సమయంలో బ్యాలెన్స్ తప్పడంతోనే సహాయం కోసం కిటికీని తన్ని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో లుసిడి కెమెరాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లూసిడి కెమెరాలో ఎత్తైన భవంతుల మీదినుంచి చేసే విన్యాసాల వీడియోలు ఉన్నాయి. మృతికి గల కారణాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు.