అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా కరోనా మున్సిపల్ ఎయిర్ పోర్టులో  ఓ చిన్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఎయిర్ పోర్ట్ లో బుధవారం ఉదయం చిన్నపాటి సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ అవుతుండగానే ప్రమాదానికి గురయ్యింది. టేకాఫ్ అయిన వెంటనే గాలిలోకి పూర్తిస్థాయిలో ఎగరలేకపోయింది. ఈ క్రమంలో విమానం ఫెన్స్ ను తాకుతూ కుప్ప కూలింది. దీంతో.. వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో... విమానంలో ప్రయాణిస్తున్న  నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read నేపాల్ రిసార్ట్ లో గ్యాస్ లీక్ ప్రమాదం: 8 మంది కేరళ టూరిస్టుల మృతి...

ఫైలెట్ కు విమానంపై కంట్రోల్ తప్పిందని.. దీంతో రన్ వేపై చాలా వేగంగా విమానం పరిగెత్తిందని ప్రమాదాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన మరో పైలట్ చెప్పారు. ఇంధన ట్యాంకుల నుంచి పేలుడు శబ్ధం వినిపించగానే విమానంలో మంటలు వ్యాపించాయని అతను చెప్పారు. అందులోని ప్రయాణికులు భయంతో గట్టిగా అరిచారని తెలిపారు. విమానం గంటకు 90మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ ఉండవచ్చని మరో పైలెట్ అంచనా వేశారు. కాగా... ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని.. దీనిపై విచారణ జరుపుతున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు.