ఖాట్మండు: గ్యాస్ లీక్ కారణంగా స్పృహ తప్పి పడిపోయి నేపాల్ లోని ఓ రిసార్ట్ లో 8 మంది కేరళ టూరిస్టులు మృత్యువాత పడ్డారు. నేపాల్ లోని ఓ రిసార్ట్ గదిలో మంగళవారం ఆ ప్రమాదం సంభవించింది. మృతుల్లో నలుగురు మైనర్లు ఉన్నారు. 

స్పృహ తప్పి పడిపోయినవారిని హెచ్ఎఎంఎస్ ఆస్పత్రికి వాయుమార్గంలో తరలించారు. అయితే, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. పోలీసు సూపరింటిండెంట్ సుశీల్ సింగ్ రాథౌర్ ఆ విషయం చెప్పారు.

మృతులను ప్రబీన్ కుమార్ నాయర్ (39), శరణ్య (34), రంజిత్ కుమార్ టీబీ (39), ఇందు రంజిత్ (34), శ్రీ భద్ర (9), అభినబ్ సొరయా (9), ఎబీ నాయర్ (7), వైష్ణవ్ రంజిత్ (2)లుగా గుర్తించినట్లు ఖాట్మండ్ పోస్టు రాసింది. 

నేపాల్ లో మరణించిన 8 మంది మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా కేరళకు తెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

సాధ్యమైనంత త్వరగా మృతదేహాలను స్వదేశం తీసుకుని రావడానికి ఖాట్మండులోని ఇండియన్ ఎంబసీ చర్యలు తీసుకుంటున్నట్లు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ చెప్పారు. తాము ఖాట్మండులోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.

టూరిస్టు స్థలాలను సందర్శించిన తర్వాత స్వదేశానికి తిరిగి వస్తూ ఎవరెస్ట్ పనోరమ రిసార్ట్ లో సోమవారం ఆగారని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. 

గదిలో ఉన్న టూరిస్టులు వేడి కోసం గ్యాస్ హీటర్ ఆన్ చేసి ఉంచారని రిసార్ట్ మేనేజర్ అన్నారు. వాళ్లు నాలుగు గదులు బుక్ చేసుకున్నారని, అయితే ఎనిమిది మంది ఒకే గదిలో ఉన్నారని చెప్పాడు. గది కిటికీలకు, తలుపులకు లోపలి నుంచి గొళ్లాలు వేసుకున్నట్లు తెలిపాడు.వెంటిలేషన్ లేకపోవడం వల్ల మరణించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.