వేడి నీటి పైపు పేలిపోవడంతో నలుగురు మరణించిన ఘటన రష్యాలోని మాస్కో సిటీలో జరిగింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

రష్యా రాజధాని మాస్కోలో విషాదం చోటు చేసుకుంది. వ్రెమెనా గోదా మాల్ వద్ద వేడి నీటి పైపు పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో పది మందికి కాలిన గాయాలు అయ్యాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మొదట ఒకే మరణం సంభవించిందని మేయర్ పేర్కొన్నారు. కానీ మరో ముగ్గురు కూడా చనిపోయారని ఆయన స్పష్టం చేశారు.

Scroll to load tweet…

‘‘షాపింగ్ సెంటర్‌లో జరిగిన విషాదం మరో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. వారి కుటుంబాలకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని మేయర్ సెర్గీ సోబ్యానిన్ టెలిగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో పది మందికి కాలిన గాయాలయ్యాయని, వారిలో తొమ్మిది మందిని ఆసుపత్రిలో చేర్చామని, ఒకరిని ఔట్ పేషెంట్ చికిత్స కోసం పంపామని హెల్త్ సర్వీసెస్ వార్తా సంస్థ ‘టాస్’కు తెలిపాయి.

హింసకు పాల్పడితే దేవాలయాలనైనా మూసివేయండి - మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఇదిలావుండగా.. మాస్కో మాల్ లో పైపు పగిలిన ఘటనపై రష్యా దర్యాప్తు కమిటీ క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఇన్వెస్టిగేటివ్ కమిటీ మాస్కో విభాగం ప్రతినిధి యూలియా ఇవానోవా ప్రకటించారు. రష్యన్ ఫెడరేషన్ క్రిమినల్ కోడ్ లోని ఆర్టికల్ 238లోని పార్ట్ 3 (రెండు లేదా అంతకంటే ఎక్కువ మరణాలకు కారణమైన సేవలను అందించడంలో నిర్లక్ష్యం) కింద నేరం ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. కాగా.. 2007లో ప్రారంభమైన వ్రెమెనా గోదా మాల్ లో 150కి పైగా స్టోర్లు ఉన్నాయి.