టెన్షన్: 14 నిమిషాలు మిస్, విమానంలో సుష్మా స్వరాజ్

టెన్షన్: 14 నిమిషాలు మిస్, విమానంలో సుష్మా స్వరాజ్

న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రయాణిస్తున్న విమానం జాడ 14 నిమిషాల పాటు రాడారుకు చిక్కలేదు. దీంతో అధికారులు టెన్షన్ పడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న వివిఐపీ విమానం మేఘదూత (ఐఎఫ్‌సి-31)కు, మారిషస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు మధ్య దాదాపు 14 నిమిషాలపాటు సంబంధాలు తెగిపోయాయి. 

ఈ సంఘటనపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ సదస్సు, ఐపిఎస్‌ఏ(ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) మంత్రుల సమావేశం నేపథ్యంలో భారత వైమానిక దళానికి  చెందిన ఐఎఫ్‌సి31 విమానంలో శనివారం సుష్మా స్వరాజ్ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరారు. 

ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం సాంకేతిక సమస్య వల్ల  త్రివేండ్రంలో దిగింది. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:08 గంటలకు తిరిగి దక్షిణాఫ్రికాకు బయలుదేరింది. సరిగ్గా 4.44 గంటలకు ఇండియా ఎయిర్‌స్పేస్ నుంచి మారిషస్ ఎయిర్ స్పేస్‌లోకి ఐఎఫ్‌సి-31 ప్రవేశించింది. అయితే మారిషస్ ఏటీసీతో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. 

ఈ విషయాన్ని మారిషస్ ఏటీసీ వెల్లడించింది. విమానం తమ గగనతలంలోకి ప్రవేశించినప్పటికీ ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో కమ్యూనికేట్ కాలేదని తెలిపింది. దీంతో తీవ్రమైన కలవరం ప్రారంభమైంది. ఐఎఫ్‌సి-31తో సంబంధాలు తెగిపోయాయని కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన 12 నిమిషాలకు మారిషస్ ఏటీసీ తొలి సంకేతాన్నిచ్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి మరో ప్రకటన చేసింది. 

ఐఎఫ్‌సి-31తో ఇప్పటికి కూడా ఏ విధమైన కమ్యునికేషన్స్ లేవంటూ ఐఎన్‌సిఈఆర్ఎఫ్ఎ సంకేతాలు జారీచేసింది.  ఐఎఫ్‌సి31‌ అందుబాటులోకి వచ్చిందని, మారిషస్‌లో ల్యాండ్ అయినట్లు ఆ తర్వాత సరిగ్గా 4.58 నిమిషాలకు ఆ దేశం ఏటీసీ ప్రకటించింది. దీంతో ఏయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఊపిరి పీల్చుకుంది. ఐఎఫ్‌సి-31 అక్కడి నుంచి మళ్లీ దక్షిణాప్రికాకు బయలుదేరి వెళ్లింది.
 
అయితే ప్రపంచ ఏటీసీ నిబంధనల ప్రకారం.. సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న ఒక విమానానికి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోతే.. దానితో కమ్యూనికేషన్ పునరుద్ధరనకు 30 నిముషాల వరకు ఎదురు చూస్తుంది. అప్పటికీ ఆ విమానంతో సంబంధాలు పునరుద్ధరణ కాకపోతే ప్లేన్ మిస్ అయినట్లు ప్రకటిస్తుంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM INTERNATIONAL

Next page