అందరికీ ఫిట్ నెస్ జాగ్రత్తలు చెప్పే ట్రైనర్.. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ, మెడ విరిగి మృతి.. వీడియో వైరల్
అందరికీ వర్కౌట్లు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పే ఓ ఫిట్ నెస్ ఇన్ ఫ్లుయెన్సర్.. వర్కౌట్లు చేస్తూ చనిపోయారు. ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.

ఆయన ఓ ఫిట్ నెస్ ఇన్ ఫ్లుయెన్సర్. అందరికీ ఫిట్ నెస్ కు సంబంధించిన సలహాలు ఇస్తారు. ఎలా బరువులు ఎత్తాలో ? ఎలా ఎత్తకూడదో సూచిస్తారు. వర్కౌట్లు చేసే సరైన పద్ధతి, సరిగా చేయకపోతే ఎదురయ్యే పరిణామాలను హెచ్చరిస్తాడు. కానీ అందరికీ సలహాలు ఇచ్చే ఆయనే.. వర్కౌట్లు చేస్తూ చనిపోయారు. దాదాపు రెండు క్వింటాళ్ల బరువును మెడతో ఎత్తుతూ, కింద పడిపోయాడు. దీంతో అతడు మెడ విరిగి మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండోనేషియాకు చెందిన 33 ఏళ్ల జస్టిన్ విక్కీ అనే ఫిట్ నెస్ ఇన్ ఫ్లుయెన్సర్ మెడ విరిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇండోనేషియాలోని బాలిలోని ఓ జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా జూలై 15న ఈ ప్రమాదం జరిగినట్లు ఛానల్ న్యూస్ ఏషియా తెలిపింది. ఇటీవల ప్యారడైజ్ బాలి జిమ్ లో బార్ బెల్ ను భుజాలపై వేసుకుని స్క్వాట్ ప్రెస్ చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో బార్బెల్ అతడి మెడ వెనుక భాగంలో పడటంతో కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో జస్టిన్ విక్కీ 210 కిలోల బరువు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నట్లు ఛానల్ ‘న్యూస్ ఏషియా’ తెలిపింది.
దీంతో వెంటనే ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదం వల్ల ఆయన మెడ విరగడంతో పాటు గుండె, ఊపిరితిత్తులకు అనుసంధానంగా ఉండే కీలక నరాలు దెబ్బతినడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా.. జస్టిన్ విక్కీ మరణం పట్ల సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతున్నాయి.