దేశమంతా లైవ్‌లో చూస్తున్న పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పలు రాజ్యాంగ సవరణలపై పార్లమెంటులో చర్చ తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత కొందరు ఎంపీలు సహనం కోల్పోయి తోటి వారిపై దాడికి దిగారు. తోసుకోవడం, పిడిగుద్దులు కురిపించడం వీడియోలో కనిపించాయి. కొందరు నేలపై పడిపోగా.. మరికొందరు పరుగులు పెట్టారు.
న్యూఢిల్లీ: వాళ్లంతా చట్టసభ్యులు.. దేశ ప్రగతి దిశను నిర్దేశించేవారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నాయకులు. దేశానికి కావాల్సిన చట్టాలు తెచ్చే వేదికైన పార్లమెంటు(Parliament)లోనే వాళ్లు స్థిమితం కోల్పోయినట్టు కనిపించారు. సహనం లేకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు (Fist Fight) కురిపించుకున్నారు. తోసుకోవడం, కిందపడిపోవడం సింపుల్‌గా జరిగిపోయింది. అయితే, పార్లమెంటులో జరిగే చర్చ కదా.. దేశానికంతా చూపించాలనే ఆలోచనలతో ఓ చానెల్ లైవ్ టెలికాస్ట్ (Live telecast) చేసింది. ఇంకేముంది.. ఈ రచ్చంతా దేశ ప్రజలు లైవ్‌లో చూశారు. అంతేనా.. ఆ క్లిప్పులు ఇప్పుడు సోషల్ మీడియాకూ ఎక్కాయి. జోర్డన్ దేశ పార్లమెంటులో.. ఈ ఘర్షణలు బుధవారం జరిగాయి. జోర్డన్(Jordan) క్యాపిటల్ అమ్మాన్‌లోని ప్రతినిధుల సభలో చోటుచేసుకున్నాయి.
రాజ్యాంగంలోని సమాన హక్కుల సెక్షన్‌లో జోర్డాన్ పౌరురాలిగా ఆడవాళ్లనూ చేర్చడంపై పార్లమెంటులో చర్చ జరుగుతున్నది. దీనికి సంబంధించి ఓ సవరణ ముసాయిదాపై బుధవారం చాలా మంది ఎంపీలు పార్లమెంటులో చర్చించారు. కొంత మంది ఎంపీలు ఈ డ్రాఫ్ట్ అక్కర్లేదని వాదించారు. ఈ డ్రాఫ్ట్‌పై డిప్యూటీ సులేమన్ అబు యహ్యా, పార్లమెంటు స్పీకర్ అబ్దుల్ కరీం దుగ్మిల మధ్య వాగ్వాదం జరిగింది. దుగ్మికి అసలు ఏమీ తెలియదని, సభను నడపడమూ చేతకాదని సులేమన్ అబు యహ్యా ఆరోపణలు సంధించారు. ఈ ఆరోపణలతో పరిస్థితులు దారుణంగా దిగజారాయి. ఒకరిపై ఒకరు ముష్టి యుద్ధానికి దిగారు.
ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. పంచ్‌లు ఇచ్చుకున్నారు. తోసుకున్నారు. కొందరు నేలపై పడిపోయారు. మరికొందరు పరుగులు తీశారు. సభ అంతా గందరగోళంలో మునిగిపోయింది. కొన్ని నిమిషాల పాటు ఇలాంటి పరిస్థితులే సగాయి. దీంతో బుధవారం నాడు ఈ సభను గురువారాని వాయిదా వేశారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి తోడు అరుపులు కేకలూ వినిపించాయి. ఒకరిని ఒకరు దూషించుకున్నట్టూ తెలుస్తున్నది. ఇలాంటి ప్రవర్తన సరికాదని, ఎంపీలు వ్యవహార శైలి అభ్యంతరకరం అని ఓ పార్లమెంటు సభ్యుడు ఆక్షేపించారు. ఇది దేశ ప్రతిష్టనూ భంగపరుస్తుందని ఎంపీ ఖలీల్ అతియేహ్ పేర్కొన్నారు.
Also Read: రాజ్యసభ ఛైర్మన్‌పైకి రూల్‌బుక్.. టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు
మహిళలకు హక్కులతోపాటు జాతీయ భద్రత మండలి ఏర్పాటు, అలాగే హౌజ్ స్పీకర్ పదవీ కాలాన్ని రెండేళ్ల నుంచి ఒక సంవత్సరానికి తగ్గించాలనే రాజ్యాంగ సవరణలపై పార్లమెంటులో చర్చ జరుగుతున్నది. జోర్డన్‌లో 1952లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి 29 సార్లు సవరణలు చేశారు. అయితే, ఇందులో చాలా వరకు చట్ట సభ హక్కులను హరించి.. రాజవంశానికే అధికారాలు పెంచే సవరణలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు.
మన దేశంలో గత పార్లమెంటు సమావేశాల చివరి రోజున 12 రాజ్యసభ ఎంపీల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉన్నదని చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అందుకు అంగీకరించలేదు. రాజ్యసభ ప్రతిష్టను దెబ్బతీసేలా బల్లలు ఎక్కి, నల్ల జెండాలు ఊపిన గందరగోళాన్ని సృష్టించిన ఆ ఎంపీలు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని అన్నారు. వారు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తే అప్పుడు వారిపై సస్పెన్షన్ ఎత్తివేతను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
