ఇజ్రాయెల్ లోని వెస్ట్ బ్యాంక్ లో భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించేందుకు ఈ కాల్పులు జరిపినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే ఈ చొరబాటును పాలస్తీనా ఊచకోతగా అభివర్ణించింది. 

ఇజ్రాయెల్ దళాలు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ప్రధాన పాలస్తీనా నగరంలోకి బుధవారం ప్రవేశించి కాల్పులు జరిపాయి. ఉగ్రవాద అనుమానితులను ఏరివేసేందుకు పగటిపూట ఆపరేషన్‌లో నిర్వహించాయి. అయితే ఈ ఘటనలో 10 మంది పాలస్తీనియన్లు మరణించారు. అనేక మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాద అనుమానితులు ఉన్నట్టు గుర్తించి, కాల్పులు జరిపామని, ఇది ఉగ్రవాద-వ్యతిరేక ఆపరేషన్ అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందులో ఎలాంటి పౌర ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. కాగా.. పాలస్తీనా ఉన్నతాధికారి హుస్సేన్ అల్-షేక్ ఈ చొరబాటును ఊచకోతగా అభివర్ణించారు. తమ ప్రజలకు అంతర్జాతీయ రక్షణ అవసరం అని పిలుపునిచ్చారు.

వెస్ట్ బ్యాంక్‌లో గతంలో జరిగిన కాల్పులకు పాల్పడినట్టు భావిస్తున్న ముగ్గురు వాంటెడ్ మిలిటెంట్లను అరెస్టు చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం నగరంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. అయితే తాము భవనాన్ని చుట్టుముట్టామని, లొంగిపోవాల్సిందిగా వారిని కోరామని, కానీ వారు కాల్పులు జరిపారని సైన్యం తెలిపింది. కాల్పుల్లో ఆ ముగ్గురూ మరణించారని పేర్కొంది.

తజికిస్తాన్‌లో 6.8-తీవ్రతతో కూడిన భూకంపం.. 20ని.ల్లోనే మరొకటి..

దాడి సమయంలో ఆయుధాలతో ఉన్న అనుమానితులు బలగాల వైపు భారీగా కాల్పులు జరిపారని సైన్యం తెలిపింది. దీంతో బలగాలు కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొంది. ఇదే సమయంలో మరికొందరు దళాలపైకి రాళ్లు, పేలుడు పదార్థాలు విసిరారని పేర్కొంది. ఈ దాడిలో ఇజ్రాయెల్‌కు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. తరువాత ఈ ఘటనలో స్వాధీనం చేసుకున్న రెండు ఆటోమేటిక్ రైఫిళ్ల ఫొటోలను సైన్యం విడుదల చేసింది. 

ఈ బుల్లెట్ల దాడి వల్ల ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. సమీపంలో ఉన్న షాపులన్నీ బుల్లెట్లతో నిండిపోయాయి. పార్క్ చేసిన కార్లు నుజ్జునుజ్జయ్యాయి. సిమెంట్ శిథిలాల మీద రక్తపు మరకలు పడ్డాయి. ధ్వంసమైన ఇంటిలోని ఫర్నీచర్ శిథిలాల మధ్య చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే ఈ ఘటనలో గాయపడిన 102 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చనిపోయిన వారిలో 72 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు. 

సల్మాన్ రష్దీ ఇప్పుడో జీవచ్ఛవం.. దాడి చేసిన వ్యక్తికి బహుమతి ప్రకటించిన ఇరాన్ సంస్థ

గత నెల, ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దళాలు ఇదే విధమైన దాడిలో 10 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. మరుసటి రోజు, తూర్పు జెరూసలేం సెటిల్‌మెంట్‌లోని ప్రార్థనా మందిరం సమీపంలో ఒంటరిగా ఉన్న పాలస్తీనా ముష్కరుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. కొన్ని రోజుల తరువాత వెస్ట్ బ్యాంక్‌లో వేరే ప్రదేశంలో ఇజ్రాయెల్ దాడిలో ఐదుగురు పాలస్తీనియన్లు మరణించారు. ఆ తర్వాత జెరూసలెంలో పాలస్తీనా కారు ఢీకొని ఇద్దరు అన్నదమ్ములు సహా ముగ్గురు ఇజ్రాయెలీలు మరణించారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు కూడా గడవక ముందే సున్నితమైన సమయంలో ఈ పోరు జరగడం గమనార్హం. పాలస్తీనా మిలిటెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చిన అతి జాతీయవాదుల ఆధిపత్యం ప్రభుత్వంలో ఉంది. ఇది మరింత హింసకు దారితీస్తుందని భద్రతా ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.

గాజా స్ట్రిప్ లో అధికార హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధికార ప్రతినిధి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో తమ ప్రజలపై శత్రువులు చేస్తున్న నేరాలను గాజాలో ప్రతిఘటన గమనిస్తున్నదని, దాని సహనం నశించిపోతోందని ఆ సంస్థ ప్రతినిధి అబూ ఒబేదా అన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో భారతీయుడు.. ఇంతకీ ఆయన ఎవరు?

2007 లో గాజాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ బృందం ఇజ్రాయెల్తో నాలుగు యుద్ధాలు చేసింది. మార్చిలో ప్రారంభమయ్యే ముస్లిం పవిత్ర మాసం రంజాన్ కు ముందు పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి ఇజ్రాయెల్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంలో ఈ ఏడాది కనీసం 55 మంది పాలస్తీనియన్లు మరణించారు. గత ఏడాది వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంలో దాదాపు 150 మంది పాలస్తీనియన్లు మరణించారని, 2004 తర్వాత ఆ ప్రాంతాల్లో ఇదే అత్యంత ఘోరమైన సంవత్సరం అని ఇజ్రాయెల్ హక్కుల సంస్థ బి'సెలెమ్ గణాంకాలు చెబుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లేనని, అయితే చొరబాట్లను నిరసిస్తున్న యువకులు, ఘర్షణల్లో పాల్గొనని ఇతర వ్యక్తులను కూడా హతమార్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. మృతుల్లో సగం మంది మాత్రమే మిలిటెంట్ గ్రూపులకు చెందిన వారని ‘ఏపీ’ లెక్కలు చెబుతున్నాయని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. 

మిలిటెంట్ నెట్ వర్క్ లను నిర్మూలించడానికి, భవిష్యత్తులో జరిగే దాడులను అడ్డుకోవడానికి ఈ సైనిక దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతుండగా.. పాలస్తీనియన్లు వాటిని ఇజ్రాయెల్ 55 సంవత్సరాల బహిరంగ ఆక్రమణకు మరింత బలం చేకూర్చేవిగా భావిస్తున్నారు. కాగా.. 1967 మధ్యప్రాచ్య యుద్ధంలో ఇజ్రాయిల్ వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెం, గాజా స్ట్రిప్ లను స్వాధీనం చేసుకుంది. పాలస్తీనియన్లు ఇవి స్వతంత్ర రాజ్యం కోసం కోరుకునే భూభాగాలుగా ఉన్నాయి.