EXCLUSIVE : కొలంబో- న్యూఢిల్లీ మధ్య ఏనాడో సంతకాలు .. కచ్చతీవు వివాదం "సెటిలైందన్న" శ్రీలంక అధికారి
దశాబ్థాల విరామం తర్వాత కచ్చతీవు సమస్యను లేవనెత్తడం న్యూఢిల్లీకి సంబంధించిన విషయం అని , అది కొలంబోది కాదని, శ్రీలంక ప్రభుత్వంలోని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఆసియానెట్‌తో మాట్లాడుతూ చెప్పారు. చారిత్రక వాస్తవాల ఆధారంగా ఈ ఒప్పందం 1974లో సంతకం చేయబడి సెటిలైందని వివరించారు.
కచ్చతీవు వివాదం ఇప్పుడు భారత రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. 1974లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో కచ్చతీవు ద్వీపంపై భారత్ - శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌లు కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అయినప్పటికీ శ్రీలంక పక్షం దానిని ఒక అంశంగానే భావించింది. దశాబ్థాల విరామం తర్వాత కచ్చతీవు సమస్యను లేవనెత్తడం న్యూఢిల్లీకి సంబంధించిన విషయం అని , అది కొలంబోది కాదని, శ్రీలంక ప్రభుత్వంలోని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఆసియానెట్‌తో మాట్లాడుతూ చెప్పారు. చారిత్రక వాస్తవాల ఆధారంగా ఈ ఒప్పందం 1974లో సంతకం చేయబడి సెటిలైందని వివరించారు.
కచ్చతీవు ద్వీపం జాఫ్నా రాజ్యంలో భాగమని.. 1970లలో ఇరుదేశాలకు చెందిన తెలివిగల వ్యక్తులు ఒప్పందంపై సంతకాలు చేశారని ఆ అధికారి పేర్కొన్నారు. కానీ రెండు దేశాలలో ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ సమయంలో వ్యాఖ్యానించడం సరికాదని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు ద్వీపం ఇష్యూపై మార్చి 31న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. పాక్ స్ట్రెయిట్ నుంచి ఆడమ్స్ బ్రిడ్జి వరకు వున్న చారిత్రాత్మక జలాల్లో ఇరుదేశాల మధ్య సరిహద్దును గుర్తించేందుకు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఏప్రిల్ 1న జైశంకర్ దేశ రాజధానిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుందని, దానికి బాధ్యత వహించడానికి నిరాకరిస్తోందని మండిపడ్డారు. కచ్చతీవును ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు ఎలా అప్పగించిందో తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై వెల్లడించిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది.
ఇంతకీ కచ్చతీవు వివాదం ఏంటీ :
కచ్చతీవు ద్వీపం 285 ఎకరాల విస్తీర్ణంలో జనావాసాలు లేని ఆఫ్ షోర్ ద్వీపం. ఇది భారత్- శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో భారత తీరానికి 33 కిలోమీటర్ల దూరంలో వుంది. 14వ శతాబ్ధిలో అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత ఈ ద్వీపం ఉనికిలోకి వచ్చింది. ప్రారంభ మధ్య యుగ కాలంలో ఈ ద్వీపం శ్రీలంకలోని జాఫ్నా రాజ్య పాలనలో వుంది. 17వ శతాబ్ధం నుంచి రామనాథపురానికి చెందిన రామనాడ్ రాజ్యం.. రామేశ్వరానికి వాయువ్యంగా 55 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ద్వీపాన్ని నియంత్రించేది. ఈ క్రమంలో 1974లో రెండు దేశాలు కచ్చతీవుపై దావా వేశాయి. 1976 వరకు భారతీయ మత్స్యాకారులకు ఈ ప్రాంతంలో ఫిషింగ్ హక్కులు వున్నాయి. కానీ ఆ తర్వాత కచ్చతీవు ద్వీపంలో ఆ హక్కులు నిరాకరించబడ్డాయి.
1970వ దశకంలో తక్కువ వ్యూహాత్మక విలువ వుండేది. అయితే గడిచిన రెండు దశాబ్ధాలలో శ్రీలంక జలాల్లో చైనా ప్రభావం కారణంగా భౌగోళిక రాజకీయ దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఈ ద్వీపం భారతదేశానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన భాగంగా మారింది.
కచ్చతీవు ద్వీపంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఖరి ఏంటీ :
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందేందుకు దేశం యుద్ధం చేయాల్సి వుంటుందని మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొంది. 2015లో సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా మోడీ ప్రభుత్వం ఇలా చెప్పింది. ‘‘ ప్రశ్నలో వున్న ప్రాంతం ఎన్నడూ గుర్తించబడనందున భారతదేశానికి చెందిన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం లేదా విడిచిపెట్టడం లాంటివి చేయబడలేదు. ఒప్పందాల ప్రకారం.. కచ్చతీవు ద్వీపం భారత్-శ్రీలంకల మధ్య అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖలో శ్రీలంక వైపున వుంది ’’ అని జవాబిచ్చింది.
శివసేన నాయకురాలు, రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది .. అన్నామలై ఆర్టీఐ ద్వారా అందుకున్న సమాధానంపై ప్రశ్నించారు. ‘‘ వారి ఎన్నికల రాజకీయాల కోసం వైఖరిలో మార్పు వుందా లేదా మోడీజీ శ్రీలంకపై కేసు పెట్టారా ’’ అని నిలదీశారు.