పీవోకేను ఖాళీ చేయండి.. ఉగ్రవాదాన్ని ఆపండి - ఐక్యరాజ్యసమితిలో పాక్ ను హెచ్చరించిన భారత్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కాళీ చేయాలని ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ను భారత్ హెచ్చరించింది. అలాగే భారత్ లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలని తొలగించాలని పేర్కొంది. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమని పునరుద్ఘాటించింది.

Evacuate PoK.. Stop Terrorism: India warns Pakistan in United Nations..ISR

సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని, తమ గడ్డపై ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించాలని, అక్రమ ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలను ఖాళీ చేయాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో పాకిస్థాన్ ను భారత్ శుక్రవారం (స్థానిక కాలమానం) హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) 78వ సమావేశాల్లో పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో.. దానికి భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది.

భారత్ కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడానికి పాకిస్తాన్ పదేపదే అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని భారత్ మండిపడింది. జమ్ముకాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, ఈ అంశంపై వ్యాఖ్యానించే హక్కు పాకిస్థాన్ కు లేదని స్పష్టం చేసింది. ‘‘ భారత్ కు వ్యతిరేకంగా నిరాధారమైన, దురుద్దేశపూరిత ప్రచారాన్ని ప్రచారం చేయడానికి ఈ వేదికను దుర్వినియోగం చేయడం పాకిస్థాన్ కు అలవాటైపోయింది. మానవ హక్కులపై తన చెత్త రికార్డు నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకే పాకిస్థాన్ అలా చేస్తుందని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలకు, ఇతర బహుళపక్ష సంస్థలకు బాగా తెలుసు’’ అని ఐక్యరాజ్యసమితి రెండో కమిటీకి యూఎన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్ గహ్లోత్ అన్నారు.

‘‘జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమని పునరుద్ఘాటిస్తున్నాం. జమ్ముకాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలు పూర్తిగా భారత్ అంతర్గతం. తమ దేశీయ విషయాలపై వ్యాఖ్యానించే హక్కు పాకిస్థాన్ కు లేదు’’ అని అన్నారు. ‘‘ దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే పాకిస్థాన్ తీసుకోవాల్సిన చర్యలు మూడు విధాలుగా ఉంటాయి. ముందుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపి, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తక్షణమే నిలిపివేయాలి. రెండోది చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలను ఖాళీ చేయడం. మూడోది పాకిస్తాన్ లో మైనారిటీలపై నిరంతరం జరుగుతున్న తీవ్రమైన, మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలి’’ అని గహ్లోత్ అన్నారు.

2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారులపై పాకిస్థాన్ విశ్వసనీయమైన, ధృవీకరించదగిన చర్యలు తీసుకోవాలని పెటల్ గహ్లోత్ అన్నారు. పాకిస్తాన్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని తెలిపారు. ఆ దేశంలో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను గహ్లోత్ ఎత్తిచూపారు. ఆ దేశంలో మొత్తం 19 చర్చిలు, 89 క్రైస్తవ గృహాలు దగ్ధమయ్యాయి అని తెలిపారు.

ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని భారత్ పదేపదే పాకిస్థాన్ కు చెప్పిందని, సీమాంతర ఉగ్రవాదానికి ఇస్లామాబాద్ మద్దతు, స్పాన్సర్ చేయడంపై ఈ సందర్భంగా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా.. అంతకు ముందు పాక్ తాత్కాలిక ప్రధాని కాకర్ మాట్లాడుతూ.. భారత్ తో శాంతిని తమ దేశం కోరుకుంటోందని, ఇరు దేశాల మధ్య శాంతికి కాశ్మీర్ కీలకమని స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios