పాత ట్విట్టర్ హ్యాండిల్స్ అమ్మాలని భావిస్తున్న ఎలాన్ మస్క్.. ధర తెలిస్తే షాకే..
పాత ట్విట్టర్ హ్యాండిల్స్ ను అమ్మాలని ఆ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ యోచిస్తోంది. ఒక్క హ్యాండిల్ కు 50 వేల డాలర్ల ప్రారంభ ధరగా నిర్ణయించింది. ఈ విషయాన్ని ‘ఫోర్బ్స్’ నివేదిక వెల్లడించింది.

ఎక్స్ (ట్విట్టర్) కొనుగోలు చేసిన తరువాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. వచ్చీ రాగానే భారత సంతతికి చెందిన సీఈవో పరాగ్ అగర్వాల్ ను తప్పించారు. కొంత కాలం ఆయనే సీఈవోగా కొనసాగారు. ఈ ఏడాది జూన్ లో లిండా యక్కరినో కు ట్విట్టర్ సీఈవో బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ లో ఆయన అనేక మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిని 'ఎవ్రీథింగ్ యాప్'గా మార్చే ప్రణాళికలను కూడా మస్క్ వెల్లడించారు.
కాగా.. ఎక్స్ ఆదాయం తీసుకొచ్చేందుకు ఆయన అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే మస్క్ ఇప్పుడు పాత ట్విట్టర్ హ్యాండిల్స్ ను 50,000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించినట్టు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఎక్స్ లోని @Handle బృందం మొదట రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులు ఉపయోగించని ఖాతా పేర్లను అమ్మాలనే ఉద్దేశంతో హ్యాండిల్ మార్కెట్ ప్లేస్ పై పనిచేయడం ప్రారంభించింది.
వీటిలో కొన్ని సందర్భాల్లో కొనుగోలుదారుల కోసం 50,000 డాలర్ల ధరను కోట్ చేసినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ట్విటర్ను కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ 2022 నవంబర్ నాటికి ఉన్న పాత యూజర్ నేమ్ లను విక్రయించాలని యోచిస్తున్నారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన కొద్ది రోజుల తర్వాత మస్క్ ‘‘పెద్ద సంఖ్యలో హ్యాండిళ్లను, బాట్స్ ట్రోల్స్’’ తీసుకున్నారని, వచ్చే నెలలో వాటిని విడుదల చేయడం ప్రారంభించాలని ఆ సమయంలో ఆయన ట్విట్ చేశారు.
ఎక్స్ ‘‘ఇన్ యాక్టివ్ అకౌంట్ పాలసీ’’ ప్రకారం.. వినియోగదారుల హ్యాండిల్స్ ఇన్ యాక్టివ్ కాకుండా ఉండాలంటే ప్రతీ 30 రోజులకు లాగిన్ కావాలని హెచ్చరిస్తోంది. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ప్రస్తుతానికి ఇన్ యాక్టివ్ యూజర్ నేమ్లను విడుదల చేయదని ఉద్యోగులు పేర్కొన్నారు.