Asianet News TeluguAsianet News Telugu

ఇప్పుడు నేను నాన్నను కాదు, అమ్మను.. ఇద్దరు కూతుళ్ల కోసం లింగమార్పిడి చేసుకున్న తండ్రి.. ఎందుకంటే?

ఇద్దరు కూతుళ్లను తన కస్టడీలో పెంచుకోవడానికి ఆ తండ్రి పెద్ద సాహసమే చేశాడు. ఈక్వెడార్ చట్టాల కోసం అతను ఏకంగా లింగ మార్పిడే చేసుకున్నాడు. తన మాజీ భార్య వద్ద పిల్లలు దుర్భర స్థితిలో ఉన్నారని, వారిని చూడకుండా ఇప్పటికే 5 నెలలు గడిచిపోయాయని ఆ వ్యక్తి తెలిపాడు.
 

ecuador man changes his gender to get daughters to his custody
Author
First Published Jan 8, 2023, 7:24 PM IST

న్యూఢిల్లీ: ఆయన పేరు రెనె సాలినాస్ రామోస్. ఈక్వెడార్‌ పౌరుడు. రామోస్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. రామోస్, ఆయన భార్య ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నారు. కానీ, కూతుళ్లంటే రామోస్‌కు పంచప్రాణాలు. ఈక్వెడార్ చట్టం ప్రకారం, పిల్లలు ఇద్దరూ తల్లి వద్దనే ఉండాలి. తల్లి వద్ద ఉండటమే కాదు.. రామోస్ వాళ్లని చూడను కూడా చూడలేకపోతున్నాడు. అందుకే ఆయన ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. లింగ మార్పిడి చేసుకున్నాడు. తద్వారా తాను ఇప్పుడు తండ్రిని కాదు.. తల్లిని అని ఒప్పించాలని ఆయన ప్రయత్నం. తల్లి అని చెప్పడం ద్వారా తన కూతుళ్లను తానే పెంచుతానని డిమాండ్ చేయాలని అనుకుంటున్నాడు.

47 ఏళ్ల రామోస్ తన లింగమార్పిడి చేసుకున్నాడు. ఇప్పుడు అధికారిక దస్తావేజుల్లో ఆయన తనను ఫీమేల్‌గా రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, ఆయనను నిత్యజీవితంలో మాత్రం సిస్‌జెండర్ మేల్‌గానే పేర్కొంటారు.

ఈక్వెడార్ న్యాయవ్యవస్థ ప్రధాన కారణంగా అతను లింగ మార్పిడి చేసుకున్నాడని పలు కథనాలు చెబుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం, ఈక్వెడార్ చట్టాలు పిల్లలను తండ్రికి బదులు తల్లికే అప్పగిస్తాయి. తల్లి కస్టడీకే పంపుతాయి.

Also Read: ఈక్వెడార్ జైలులో ఘర్షణ.. 15 మంది మృతి.. 20 మందికి గాయాలు

అందుకే ఈ దేశంలో తండ్రిగా ఉండటం ఒక శిక్ష అని, తనను కేవలం అన్ని అవసరాలు సమకూర్చేవాడిగానే చూశారని రామోస్ పేర్కొన్నాడు. కానీ, ఒక తల్లి పిల్లలకు పంచే ప్రేమ, ఇచ్చే రక్షణను తాను ఇవ్వాలని పరితపిస్తున్నట్టు వివరించాడు. తన కూతుళ్లు ఇప్పడు దుర్భర స్థితిలో తల్లితో ఉంటున్నారని, ఐదు నెలలుగా తాను తన పిల్లలను కలుసుకోలేకపోయానని పేర్కొన్నాడు.

మహిళకే హక్కు ఉన్నదని ఈ చట్టాలు చెబుతున్నాయని, ఇప్పుడు తాను కూడా ఒక మహిళనే అని రామోస్ వాదిస్తున్నారు. అంటే.. ఇప్పుడు తాను కూడా తల్లినే అని, తనను తాను ఇప్పుడు అలాగే భావిస్తున్నారని వివరించారు.

ఆయన నిర్ణయాలు దేశంలోని ట్రాన్స్‌జెండర్లకు ఆగ్రహం తెప్పించింది. రామోస్ వింత చేష్టలను ఖండిస్తూ ఈక్వెడార్ ఫెడరేషన్ ఎల్జీబీటీఐ సంస్థలు ఓ ప్రకటన విడుదల చేశాయి.

కాగా, రామోస్, తన మాజీ భార్యకు మధ్య కస్టడీ యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios