రెండేళ్లుగా ఫ్రిజ్లోనే తల్లి మృతదేహం.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా మేనేజ్.. కారణం అదేనా?
అమెరికాలో ఓ మహిళ తన తల్లి మరణించిన విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా రెండేళ్లు దాచి పెట్టి ఉంచింది. ఆ రెండేళ్లు తన తల్లి మృతదేహాన్ని డీప్ ఫ్రీజర్‌లో ఉంచింది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు కూడా పసిగట్టలేనంత జాగ్రత్తగా వ్యవహరించింది.

న్యూఢిల్లీ: అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఫ్రిజ్‌లో రెండేళ్లుగా తల్లి శవాన్ని దాచిపెట్టిందామె. ఆ విషయాన్ని తన కన్న కూతురు కూడా తెలుసుకోకుండా మేనేజ్ చేసింది. ఆ మహిళ డెడ్ బాడీ ఫ్రిజ్‌లో ఉన్నదనే విషయం బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త తీసుకుంది. అమెరికాలోని షికాగోలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఎవా బ్రాచర్ అనే 60 ఏళ్ల మహిళ షికాగోలో నివసిస్తున్నది. ఆమె తల్లి 96 ఏళ్ల రెజీనా మిచాల్స్కీ. రెజీనా మిచాల్స్కీ రెండేళ్ల క్రితమే చనిపోయింది. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. చాలా జాగ్రత్తగా తన తల్లి డెడ్ బాడీని భద్రపరిచింది. షికాగో ఇల్లినాయిస్‌లోని రెండు అంతస్తుల భవనంలో ఆమె నివసించేది. ఆ అపార్ట్‌మెంట్ భవనం సెల్లార్‌లోని డీప్ ఫ్రిజ్‌లో తన తల్లి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచింది. ఆ తర్వాత కూడా ఎవరూ అక్కడ డెడ్ బాడీ ఉన్నట్టు గుర్తించలేదు. ఆ డీప్ ఫ్రిజ్‌లో రెజీనా మిచాల్స్కీ డెడ్ బాడీ ఉన్నట్టు షికాగో పోలీసులు కనుగొన్నారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవా బ్రాచర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం మొదలు పెట్టారు. విచారణలో షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఎవా బ్రాచర్ తన తల్లి పేరుతో ఫేక్ ఐడీని కలిగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తన తల్లి మరణించడానికి రెండేళ్ల పూర్వమే ఎవా బ్రాచర్ డీప్ ఫ్రీజర్ కొనుగలు చేసిన రషీదును కౌంటీ అసిస్టెంట స్టేట్ అటార్నీ మైఖేల్ పెకారా వివరించారు. తల్లి మరణించిన విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా గుప్తంగా దాచడం వెనుక గల కారణాలేమిటీ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, తన తల్లి ద్వారా ఎవా బ్రాచర్ ప్రభుత్వం నుంచి లభించే సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలను పొందే ప్లాన్ చేసిందా? అనే విషయం పైనా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎవా బ్రాచర్ కూతురు సబ్రీనా వాట్సన్‌కు కూడా ఈ డెడ్ బాడీ గురించి తెలియదు. అంతేకాదు, తన తల్లి ఎవా బ్రాచర్ పై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తన తల్లికి ఎవరి మీదా ప్రేమ ఉండదని, చివరికి తన మీద కూడా ప్రేమ చూపించదని వివరించారు. ఆమెకు కనీస మానవత్వం కూడా లేదని ఆగ్రహించారు. తన అమ్మమ్మను తలుచుకుని రోధించింది.