కోవిడ్-19 వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతగా వణికించిందో అందరికి తెలసిందే. కోవిడ్ వైరస్‌ మూలాలు చైనాలో ఉన్నాయని.. ఆ దేశంలోని ల్యాబ్ నుంచే ఇది లీక్ అయిందని వాదనలు ఉన్నాయి. అయితే తాజాగా వెలువడిన ఓ కొత్త నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 

కోవిడ్-19 వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతగా వణికించిందో అందరికి తెలసిందే. కోట్లాది మంది ఈ వైరస్ బారినపడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్షలాది మంది మృతిచెందారు. బాధితులకు సేవలందించిన వైద్యులలో కొందరు ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ కట్టడికి ప్రపంచ దేశాలు ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. అయితే కోవిడ్ వైరస్‌ మూలాలు చైనాలో ఉన్నాయని.. ఆ దేశంలోని ల్యాబ్ నుంచే ఇది లీక్ అయిందని వాదనలు ఉన్నాయి. అయితే తాజాగా వెలువడిన ఓ కొత్త నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 

కోవిడ్ -19 మహమ్మారి చాలా వరకు చైనా వుహాన్‌లోని బయో లాబొరేటరీ లీక్ నుంచి ఉద్భవించి ఉండొచ్చని యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నిర్ధారించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆదివారం రిపోర్టు చేసింది. ఇటీవల వైట్‌హౌస్‌కు, కాంగ్రెస్‌లోని ముఖ్య సభ్యులకు అందించిన వర్గీకృత ఇంటెలిజెన్స్ నివేదికలో.. వుహాన్‌లోని ల్యాబ్ నుంచి కోవిడ్-19 వైరస్ ప్రమాదవశాత్తు తప్పించుకుందనే దానిపై ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ‘‘తక్కువ విశ్వాసం’’ ఉందని తెలిపినట్టుగా ఇంటెలిజెన్స్ నివేదికను చదివిన వ్యక్తులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇక, నేషనల్ ఇంటెలిజెన్స్ ప్యానెల్‌తో పాటు మరో నాలుగు యూఎస్ ఏజెన్సీలు ఇప్పటికీ కోవిడ్ -19 సహజ ప్రసారం వల్ల సంభవించినట్లు చెబుతున్నాయి.

ఖండించిన చైనా.. 
వుహాన్‌లోని బయో లాబొరేటరీ నుంచి కోవిడ్ -19 మహమ్మారి లీక్ అయిందనే నివేదికలను చైనా ఖండించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికపై స్పందించిన చైనా.. కోవిడ్ -19 వైరస్ వుహాన్‌లోని బయో లాబొరేటరీ నుండి లీక్ అయి ఉండవచ్చని వాదనలను తిరస్కరించింది. కోవిడ్ మహమ్మారి మూలాలను గుర్తించడం అనేది సైన్స్‌కు సంబంధించినదని..రాజకీయం చేయకూడదని చైనా పేర్కొంది.

చైనీస్ ప్రయోగశాల నుంచి మహమ్మారి లీక్ అయి ఉండవచ్చనే సిద్ధాంతాన్ని అంతర్జాతీయ నిపుణులు ‘‘చాలా అసంభవం’’గా పరిగణించారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ఇది సైన్స్ ఆధారితమని.. వుహాన్‌లోని ల్యాబ్‌కు క్షేత్రస్థాయి పర్యటనలు, పరిశోధకులతో లోతైన సంభాషణ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)-చైనా జాయింట్ మిషన్ నిపుణులు అధికారిక ముగింపుకు చేరుకున్నారని ఆమె చెప్పారు. 

కోవిడ్-19 ఎలా ఉద్భవించిందనేది మిస్టరీగానే..
కోవిడ్-19 మహమ్మారి వెలుగుచూసి ఇప్పటికీ మూడు సంవత్సరాలు గడిచిన సంగతి తెలిసింతే. అయితే వైరస్ మొదట ఎలా ఉద్భవించింది అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. కోవిడ్ వైరస్ మొదటగా నమోదైన సెంట్రల్ చైనీస్ నగరమైన వుహాన్‌లోని ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తూ లేదా మరేదైనా మార్గంలో బయటపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక, వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) దశాబ్ద కాలంగా గబ్బిలాలలోని కరోనా వైరస్‌లను అధ్యయనం చేస్తోంది.

2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ల్యాబ్-లీక్ సిద్ధాంతంపై తీవ్ర వివాదం మధ్య వుహాన్‌ను సందర్శించింది. వుహాన్ బయో ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కావడం అనేది ‘‘తక్కువ సంభావ్య పరికల్పన’’ అని డబ్ల్యూహెచ్‌వో నివేదికలో పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్.. వుహాన్ ల్యాబ్ లీక్ ఆరోపణపై తదుపరి విచారణ అవసరమని, ‘‘అన్ని పరికల్పనలు టేబుల్‌పైనే ఉన్నాయి’’ అని అన్నారు. ఇక, డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల 68,50,594 మంది మరణించారు. మొత్తంగా 75,72,64,511 మందికి కోవిడ్ -19 పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు.