ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా దేశాలకు దేశాలే లాక్‌డౌన్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేయడంతో దేశాల మధ్య సంబంధాలు కట్ అయిపోయాయి. మాతృదేశాలకు వెళ్లలేక అనేక మంది దేశం కానీ దేశంలో అవస్థలు పడుతున్నారు.

బయట వున్న వాళ్ల పరిస్థితే ఇలా ఉంటే జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంఖ్య ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. దీనిని ముందుగానే ఊహించిన ఇరాన్ ప్రభుత్వం వేలాదిమంది ఖైదీలను బయటకు వదిలి వేసింది.

#Also Read:క్వీన్ ఎలిజిబెత్ కి కరోనా.. ప్యాలెస్ వదిలేసి..

ఈ క్రమంలో కొలంబియా రాజధాని బొగొటా జైల్లో ఖైదీలు తిరుగుబాటు చేశారు. ఈ ఘటనలో 23 మంది మరణించగా, మరో 83 మంది తీవ్రగాయాల పాలయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, పారిశుద్ధ్య లోపం కారణంగా తాము జైళ్లలో ఉండలేమంటూ ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించి విధ్వంసం సృష్టించారు.

ఈ ఘటనలో ఖైదీలతో పాటు జైలు సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కొలంబియా న్యాయ శాఖ మంత్రి మార్గరిటా క్యాబెల్లో ఆవేదన వ్యక్తం చేశారు. జైళ్లలో అపరిశుభ్ర వాతావరణం ఉందని అందువల్ల కరోనా సోకుతుందని వారు చేసిన ఆరోపణలను ఆయన కొట్టేశారు.

Also Read:భయానకంగా అమెరికాలో పరిస్థితులు.. 24గంటల్లో 100మంది మృతి

ఇప్పటి వరకు జైళ్లలో ఏ ఒక్క ఖైదీకి కరోనా నిర్థారణ కాలేదని ఆయన వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో జరుగుతున్న అల్లర్ల వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఖైదీలు కేవలం కారాగారం నుంచి పారిపోయేందుకే ఇలా చేస్తున్నారని.. తాజా ఘటనలో పాల్గొన్న ఏ ఒక్క ఖైదీ కూడా తప్పించుకోలేడని మార్గరిటా స్పష్టం చేశారు.