అమెరికా నిధుల కోత,ముందుకొచ్చిన చైనా : డబ్ల్యుహెచ్ఓకు 30 మిలియన్ డాలర్లు
కరోనాపై పోరులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అండగా నిలిచేందుకు గాను 30 మిలియన్ డాలర్లను విరాళం అందిస్తామని చైనా ప్రకటించింది.
బీజింగ్: కరోనాపై పోరులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అండగా నిలిచేందుకు గాను 30 మిలియన్ డాలర్లను విరాళం అందిస్తామని చైనా ప్రకటించింది. కరోనా విషయంలో తమను తప్పుదారి పట్టించే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహరించినందుకు గాను అమెరికా నిధులను నిలిపి వేసింది. ఈ మేరకు గురువారం నాడు చైనా ఈ విషయాన్ని ప్రకటించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రతి ఏటా అమెరికా 400 నుండి 500 మిలియన్ డాలర్లను అందిస్తోంది. అయితే కరోనా విషయంలో డబ్ల్యుహెచ్ఓ సరిగా వ్యవహరించలేదని అమెరికా నిధులను నిలిపివేసిన విషయం తెలిసిందే. నిధుల నిలిపివేత విషయమై అమెరికా పునరాలోచన చేయాలని పలు దేశాలు కూడ కోరాయి.
నిధుల కొరత కారణంగా పలు వైద్య సేవలకు ఆటంకం కలుగుతోందని డబ్ల్యు హెచ్ ఓ అత్యవసర విభాగం చీఫ్ మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో చైనా గురువారం నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు బాసటగా నిలుస్తున్నట్టుగా ప్రకటించింది. 30 మిలియన్ డాలర్లను డబ్ల్యు హెచ్ ఓకు అందిస్తామని చైనా ప్రకటించింది.
also read:ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్, చైనాలో ముద్దుల పోటీ: ఏకేసిన నెటిజన్లు
కరోనా వైరస్ గత ఏడాది డిసెంబర్ మాసంలో చైనాలోని వుహాన్ లో గుర్తించారు. అయితే ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 201 దేశాల్లో విస్తరించింది. సుమారు 26 లక్షలకు పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.