Coronavirus: చైనాపై కరోనా కాటు.. మొదలైన మరణాలు.. !
Coronavirus: కరోనావైరస్ మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. చాలా దేశాల్లో రికార్డు స్థాయిలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. దాదాపు ఏడాది కాలం తర్వాత చైనాలో కరోనా మరణాలు సంభవించాయి.
Coronavirus: చైనా, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా రెట్టింపు వేగంతో పెరుగుతుండటంపై మళ్లీ ప్రపంచం తిరిగి కోవిడ్ అలర్ట్‌లోకి జారుకుంది. ఈ వ్యాప్తికి ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్లే కారణమని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
చైనాలో మళ్లీ కరోనా మరణాలు మొదలు...
2020లో చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ కేసులు వెలుగుచూశాయి. తక్కువ కాలంలోనే ఆ దేశం మొత్తం విస్తరించడంతో పాటు యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టేసింది. గత కొంత కాలం నుంచి కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాదాపే ఏడాది తర్వాత చైనాలో కరోనా మరణాలు నమోదయ్యాయి. శనివారం నాడు అక్కడి అధికారులు రెండు కరోనా మరణాలను నివేదించారు. జీరో కోవిడ్ మిషన్ ను కొనసాగిస్తున్న చైనాలో కరోనా మరణాలు నమోదుకావడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో కొత్తగా 2,157 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. జిలిన్ ప్రావిన్స్‌లో ఎక్కువగా కేసులు వెలుగుచూశాయి.
హాంగ్ కాంగ్ లోనూ..
హాంగ్ కాంగ్ లోనూ కరోనా మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక మిలియన్ దాటాయి. అక్కడి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం 20,079 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా వైరస్ కేసులు 1,016,944 కు చేరుకున్నాయి. హాంకాంగ్‌లో మొత్తం మరణాల సంఖ్య 5,401కు చేరింది.
USలో మరిన్ని లాక్‌డౌన్‌లు !
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ.. కేసులు పెరిగితే అమెరికా త్వరలో లాక్‌డౌన్ చర్యలను విధించవచ్చని హెచ్చరించారు. Omicron వేరియంట్ కు చెందిన BA.2 సబ్-వేరియంట్ త్వరలో USలో ఇన్ఫెక్షన్ల రేటును పెంచుతుందని ఆయన అన్నారు. అందువల్ల, US పౌరులు సాధారణ జీవితం మరియు లాక్‌డౌన్‌లో జీవించడం మధ్య ముందుకు వెనుకకు పైవట్ చేయడం నేర్చుకోవాలని మీడియాతో అన్నారు.
దక్షిణ కొరియా ఓమిక్రాన్ పంజా !
దక్షిణ కొరియాలో కరోనా వైరప్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం నాడు దక్షిణ కొరియా 3,81,454 కొత్త కోవిడ్-19 ఇన్ఫెక్షన్లను నివేదించింది. దీంతో మొత్తం కోవిడ్మొ-19 కేసులు సంఖ్య 9,038,938కి పెరిగింది. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (KDCA) పై వివరాలను వెల్లడించింది. అంతకు ముందు గురువారం నాడు దేశంలోని ఆల్-టైమ్ హై 621,328 రోజువారీ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ ప్రభావం..
శనివారం ఉదయం జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSSE) ప్రస్తుత గ్లోబల్ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం.. అన్ని దేశాల్లో కలిపి 467,671,421 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 6,070,281కి పెరిగింది. అయితే మొత్తం టీకా మోతాదుల సంఖ్య 10,772,862,372కి పెరిగింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనాతో ప్రభావితమైన దేశంగా అమెరికా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్, భారత్ లు ఉన్నాయి. ఇప్పటివరకు అమెరికాలో 79,717,219 కరోనావైరస్ కేసులు, 970,804 మరణాలు నమోదయ్యాయి.