Asianet News TeluguAsianet News Telugu

పుచ్చకాయలతో ఇల్లు కొనుక్కుంటున్నారు.. అక్కడ ఆర్థిక సంక్షోభం తీరే వేరయా!

చైనాలో ఆర్థిక సంక్షోభం వేళ్లూనుకుంటున్నది. ముఖ్యంగా రియల్ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రాపర్టీ డెవలపర్స్‌ ఏడాది కాలంగా నష్టాలనే చవిచూస్తుండటంతో ప్రాపర్టీ అమ్మకాల కోసం వారు నానా అగచాట్లు పడుతున్నారు. పుచ్చకాయలు, వెల్లుల్లి, పీచ్ పంటను కూడా డౌన్‌పేమెంట్‌గా తీసుకుంటామని ప్రాధేయపడే దుస్థితికి వారు దిగజారిపోయారు.

china property developers accepting downpayments in the form of watermelon garlic for selling homes
Author
New Delhi, First Published Jul 5, 2022, 7:34 PM IST

న్యూఢిల్లీ: ప్రాపర్టీ డెవలపర్స్ ఇల్లు కట్టి అమ్ముతారని మనకు తెలుసు. కానీ, వారే తాము కట్టిన ఇల్లు కొనుగోలు చేయాలని వీధుల్లో తిరిగి ప్రచారం చేయడం మాత్రం అరుదు. అంతేకాదు.. మీ దగ్గర ఏదుంటే.. అదే ఇవ్వండి.. మేం ఇల్లు మీకు ఇస్తాం అని ఆఫర్ ఇవ్వడం మాత్రం మనం ఎక్కడా చూడం. కానీ, చైనాలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. ప్రపంచంలో మేటి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా కూడా ఇప్పుడు ఆర్థిక సంక్షోభ లక్షణాలను చవిచూస్తున్నది.

సుమారు ఏడాది కాలంగా చైనాలో ఆస్తుల కొనుగోళ్లు... ముఖ్యంగా ఇళ్ల కొనుగోలు దారుణంగా పడిపోయాయి. ఫలితంగా ప్రముఖ ప్రాపర్టీ డెవలప్‌డ్ సంస్థలు కూడా దీవాళా తీసే పరిస్థితుల్లోకి వెళ్లాయి. ఈ వారంలో కొన్ని ఇలా దివాళా తీసినవి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాపర్టీ డెవలపర్స్ మరింత దిగజారిపోకముందే ఎలాగైనా తాము నిర్మించిన ఇళ్లను అమ్ముకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బయ్యర్లను ఆకట్టుకోవడానికి వారు విచిత్ర దారుల్లోనూ వెళ్తున్నారు.

ఇందులో భాగంగా ఏ ఏరియా దేనికి ఫేమస్ అని కనుక్కుని అక్కడ వర్కవుట్ అయ్యే ఆఫర్‌లను ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు ఖీ అనే కౌంటిలో వెల్లుల్లి ఎక్కువ పండిస్తుంటారు. అక్కడి రైతులను ఆకట్టుకోవడానికి వారు ఇల్లు కొనుగోలు చేయడానికి డౌన్ పేమెంట్‌గా వెల్లుల్లి ఇచ్చినా తీసుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. మిగతా ఇన్‌స్టాల్‌మెంట్లు మాత్రం డబ్బు రూపకంగానే ఇవ్వాలనే షరతు పెడుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. పుచ్చకాయలు, వెల్లుల్లి, చైనాలో పండే పీచ్‌లను డౌన్‌పేమెంట్‌గా ఇవ్వాలని ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే, డౌన్‌పేమెంట్‌ కింద వీరు తీసుకునే ఈ పంటకు నిజానికి మార్కెట్‌లో ఉండే ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పెట్టి ఈ డెవలపర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇది డెవలపర్స్ ఎంత డెస్పరేట్‌గా ఉన్నారో అర్థం చేయిస్తున్నది.

సెంట్రల్ చైనా మేనేజ్‌మెంట్ అనే సంస్థ ఖీ కౌంటీలో మే నెలలో 16 రోజుల పాటు ఈ క్యాంపెయిన్ చేపట్టింది. వెల్లుల్లి ఇచ్చి ఇల్లు సొంతం చేసుకోండని ఆఫర్ పెట్టింది. 860,000 క్యాటీల(పది క్యాటీలు 16 కిలోగ్రాములతో సమానం) వెల్లుల్లి 30 ఇళ్ల అమ్మకానికి డీల్ కుదుర్చుకుంటూ సేకరించింది.

కాగా, నాంజింగ్ నగరంలో 5 వేల కిలోల పుచ్చకాయలు తెస్తే.. ఇల్లు డౌన్‌పేమెంట్‌గా మరో సంస్థ పరిగణిస్తున్నది.  5 వేల కిలోల పుచ్చకాయాలను వారు లక్ష చైనీస్ యువాన్లుగా లెక్కిస్తున్నారు. 5 వేల కిలోల పుచ్చకాయలకు మార్కెట్లో లభించే ధర కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ సంస్థ కొంత కాలం తర్వాత  పలు ఆఫర్లను వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios