Chandrayaan-3: ఇస్రో మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా ల్యాండ్ కావడంతో భారత్ స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా నిలిచింది. అంత‌రిక్ష రంగంలో వెన‌క్కిత‌గ్గేదే లేదంటూ నిరూపించిన భార‌త్ పై యావ‌త్ ప్ర‌పంచ దేశాల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  

Russian President Putin's comments on Chandrayaan-3: ఇస్రో మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా ల్యాండ్ కావడంతో, భారతదేశం స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా నిలిచింది. అంత‌రిక్ష రంగంలో వెన‌క్కిత‌గ్గేదే లేదంటూ నిరూపించిన భార‌త్ పై యావ‌త్ ప్ర‌పంచ దేశాల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

వివ‌రాల్లోకెళ్తే.. చంద్రుడిపై చంద్రయాన్ -3 విజయవంతంగా ల్యాండ్ అయిన త‌ర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ తదితరులు బుధవారం భారత్ ను అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధన చంద్రయాన్ -3ని చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో విజయవంతంగా ల్యాండ్ చేసినందుకు అధ్యక్షుడు పుతిన్ భారత అధ్యక్షుడు ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారని క్రెమ్లిన్ ప్రెస్ సర్వీస్ తెలిపింది.

'చంద్రుడిపై దక్షిణ ధ్రువానికి సమీపంలో చంద్రయాన్-3 స్పేస్ ప్రోబ్ విజయవంతంగా ల్యాండ్ అయినందుకు నా హృదయపూర్వక అభినందనలను స్వీకరించండి. అంతరిక్ష అన్వేషణలో ఇదొక సుదీర్ఘ ముందడుగు అనీ, సైన్స్, ఇంజినీరింగ్ రంగాల్లో భారత్ సాధించిన అద్భుతమైన పురోగతికి నిదర్శనమని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే, “భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాయకత్వం, సిబ్బందికి కొత్త విజయాలు సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు..శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పుతిన్ పేర్కొన్నారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై వ్యోమనౌకను దింపిన తొలి దేశంగా భారత్ అవతరించినందుకు యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందనలు తెలిపారు. "చంద్రుడిపై విజయవంతంగా దిగినందుకు భారత్ లోని మా మిత్రులకు అభినందనలు. పట్టుదలతోనే దేశాలు నిర్మితమవుతాయి, భారత్ చరిత్ర సృష్టిస్తూనే ఉంది" అని ఎక్స్ లో తన ఖాతాలో పోస్ట్ చేసిన సందేశంలో పేర్కొన్నారు.

ఇక చంద్రయాన్-3 విజయంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ భారత ప్రధానికి అభినందనలు తెలిపారు. "ఈ రోజు చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ -3 విజయవంతంగా ల్యాండ్ కావడం, సైన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీలో చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, భారత ఇస్రో బృందాన్ని అభినందిస్తున్నాను" అని ప్ర‌చండ పేర్కొన్నారు.

ఇది చారిత్రాత్మక ఘట్టమని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ అభివర్ణించారు. 'చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారి దిగినందుకు భారత్ కు అనందనలు. భారత ప్రజలు సాధించిన అసాధారణ విజయం' అని కొనియాడారు. చరిత్ర సృష్టించిన భారత్ ను మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ అభినందించారు. "చరిత్ర సృష్టించిన భారత్! చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో #Chandrayaan3 విజయవంతంగా ల్యాండ్ కావడం దక్షిణాసియా దేశంగా, పొరుగుదేశంగా మనకు గర్వకారణం. ఇది మానవాళి మొత్తానికి దక్కిన విజయం! అన్వేషణలో కొత్త రంగాలకు కొత్త దారులు తెరుస్తారు. కంగ్రాట్స్ #India" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.