అమెరికా రూపొందిస్తున్న గోల్డెన్‌డోమ్ రక్షణ వ్యవస్థలో చేరేందుకు కెనడా చర్చలు జరుపుతోంది.
గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ లో చేరడం గురించి చర్చలు జరుపుతున్నాం:కెనడా!
రాబోయే రోజుల్లో తమ గగనతలంలోకి ఎలాంటి క్షిపణులు కూడా ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధాలు కూడా సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మాణానికి అమెరికా శ్రీకారం చుడుతున్నట్లు ప్రపంచ దేశాలకు తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగం కావడానికి కెనడా కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే చెప్పారు.
కెనడా లక్ష్యంగా…
దీని గురించి కెనడా ప్రధాని మార్క్ కార్నీ తాజాగా స్పందించారు. గోల్డెన్ డోమ్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ‘అమెరికా రూపొందిస్తున్న గోల్డెన్‌డోమ్‌లో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నాం. ఇది కెనడా పౌరుల రక్షణకు ఇది మంచి ఆలోచన. భవిష్యత్తులో కెనడా లక్ష్యంగా అంతరిక్షం నుంచి వచ్చే క్షిపణుల ముప్పును ఇది కచ్చితంగా సమర్థంగా ఎదుర్కొంటుంది. దీనిపై ట్రంప్‌తో ఉన్నతస్థాయిలో చర్చలు జరిపేందుకు చూస్తున్నాం. మేము స్వయంగా ఈ డోమ్‌ను నిర్మించుకోవాలా? లేక అమెరికాతో భాగం కావాలా అనే దానిపైనా ఆలోచన చేస్తున్నామని కార్నీ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహాలో అమెరికా ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇక అంతరిక్షంలోనూ అమెరికా ఆయుధాలను మోహరించనుంది. యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ దీని నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ వెల్లడించారు. తన పదవీకాలం ముగిసేలోపు ఇది పూర్తవుతోందన్నారు. ప్రపంచంలోని ఏవైపు నుంచి క్షిపణి ప్రయోగించినా, అంతరిక్షం నుంచి దాడి చేసినా వాటిని అడ్డుకోగల సామర్థ్యం దీనికి ఉందని చెప్పుకొచ్చారు.
దేశ ప్రజల మనుగడకు ఇది ఎంతో ముఖ్యమైన ముందడుగన్నారు. అయితే దీని నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15లక్షల కోట్లు) ఖర్చవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. 542 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గోల్డెన్‌డోమ్ నిర్మాణాన్ని చైనా, రష్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.