ఇజ్రాయెల్‌కు చేరిన బ్రిటన్ పీఎం రిషి సునాక్, యుద్ధం గురించి ఆయన ఏమన్నారంటే?
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గురువారం ఇజ్రాయెల్‌లో దిగారు. యుద్ధం మరింత తీవ్రతరం కాకుండా ఇతర దేశాలతో దౌత్యమార్గంలో చర్చలు జరిపే ప్రయత్నంలో ఉన్నారు. విషాదంలో కూరుకుపోయిన ప్రజల తరఫున తాను నిలబడతానని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు వెళ్లిన మరుసటి రోజు బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ గురువారం ఆ దేశానికి చేరుకున్నారు. హమాస్ దాడి తర్వాత మొదలైన ఈ యుద్ధం మరింత తీవ్రతరం కాకుండా అడ్డుకోవడానికి ఇతర పొరుగు దేశాలకూ పర్యటించబోతున్నారు. దౌత్యమార్గంలో ఈ దిశగా ఆయన కృషి చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఇజ్రాయెల్‌లో ల్యాండ్ కాగానే రిషి సునాక్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘నేను ఇజ్రాయెల్‌లో ఉన్నాను. విషాదభరిత దేశంలో నేనూ మీ కష్టంలో తోడుంటాను. టెర్రరిజం అనే రక్కసికి వ్యతిరేకంగా మీతో ఎప్పటికీ నిలబడతాను’ అని కామెంట్ చేశారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, అలాగే పాలస్తీనాలో మృతులకు సంతాపం తెలియజేయనున్నారు.
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఈ రోజు ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టింది. హమాస్ పై జరుపుతున్న ఈ దాడిలో ఇజ్రాయెల్ గంపగుత్తగా పాలస్తీనా వాసులకూ శిక్ష వేస్తున్నదని పేర్కొంది. ‘హమాస్ చేసిన ఆటవిక దాడికి పాలస్తీనా వాసులందరినీ మూకుమ్మడిగా శిక్ష వేస్తున్నట్టుగా నాకు బలంగా అనిపిస్తున్నది. ప్రభుత్వాలపై ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వంపై బాధ్యత ఉంటుందని, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అమాయకుల ప్రాణాలు కాపాడే బాధ్యత ఉంటుందని భావిస్తున్నాను’ అని ఆస్ట్రేలియా ప్రధాని ఎడ్ హుసిక్ తెలిపారు.
కాగా, చైనా కూడా.. యుద్ధం వీలైనంత త్వరగా నిలిపేయాలని కోరింది. ‘ఇజ్రాయెల్, హమాస్ యుద్దం వీలైనంత వేగంగా ఆపేయాలని చైనా ఆశిస్తున్నది. ఈ కల్లోలానికి శాశ్వత పరిష్కారం కోసం అరబ్ ప్రభుత్వాలతో కలిసి పని చేయడానికి బీజింగ్ సిద్ధంగా ఉన్నది. ఈ యుద్ధం మరింత విస్తరించకుండా వెంటనే కాల్పుల విరమణ అవసరం’ అని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కామెంట్ చేశారు.
Also Read: డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ: ఆస్తుల కేసులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
గాజాలో హాస్పిటల్ పై బుధవారం జరిగిన దాడిలో వందలాది మంది మరణించారు. ఈ ఘటన పై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఇది ఇజ్రాయెల్ చేసిన దాడి అని పాలస్తీనా ఆరోపిస్తున్నది. బుధవారమే తన పర్యటనను ముగించుకున్న బైడెన్ దీనిపై స్పందించారు. గాజా హాస్పిటల్ పై బాంబులు ఇజ్రాయెల్ వేయలేదని అమెరికా స్పష్టం చేసింది. అనంతరం బైడెన్ స్పందిస్తూ.. గాజా హాస్పిటల్ పై హమాస్ కూడా ఉద్దేశపూర్వకంగా బాంబులు వేసి ఉండకపోవచ్చని అన్నారు. హమాస్ ప్రయోగించిన బాంబుల్లో పొరపాటు వల్ల అది హాస్పిటల్ పై పడి ఉంటుందని అమెరికా పేర్కొంది.