డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ: ఆస్తుల కేసులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
బెంగుళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు కర్ణాటక హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని డీకే శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు గురువారంనాడు కొట్టి వేసింది.
మూడు మాసాల్లో విచారణను పూర్తి చేయాలని సీబీఐని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆస్తుల కేసులో సీబీఐ విచారణపై ఉన్న స్టే ను కర్ణాటక హైకోర్టు ఎత్తివేసింది.2020 అక్టోబర్ 3న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను డీకే శివకుమార్ సవాల్ చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన కోర్టు 2023 ఫిబ్రవరి మాసంలో స్టే విధించింది.
2013 నుండి 2018 మధ్య కాలంలో డీకే శివకుమార్ ఆస్తులు విపరీతంగా పెరిగాయని 2020 అక్టోబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.ఈ ఎఫ్ఐఆర్ ప్రకారంగా డీకే శివకుమార్ , అతని కుటుంబ సభ్యులకు 2013 ఏప్రిల్ లో రూ. 33.92 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులున్నాయి. అయితే 2018 నాటికి డీకే శివకుమార్ కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ రూ. 128.06 కోట్లకు చేరింది. 2018 ఏప్రిల్ 30 నాటికి శివకుమార్ ఆస్తుల విలువ రూ. 162 .53 కోట్లకు చేరిందని సీబీఐ పేర్కొంది.
కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ డీకే శివకుమార్ కు చెందిన రియల్ ఏస్టేట్, మైనింగ్ కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ విచారణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ ఏడాది ఏప్రిల్ 20న కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. అయితే ఈ విషయమై కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ లో డీకే శివకుమార్ సవాల్ చేశారు. సింగిల్ బెంచ్ తీర్పుపై కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది.