బ్రెగ్జిట్‌ సంక్షోభంతో సతమతమవుతున్న బ్రిటన్‌కు మరో పెద్ద షాక్ తగిలింది. బ్రెగ్జిట్‌ విషయంలో బ్రిటన్‌ ప్రధాని థెరీసా మే అనుసరిస్తున్న విధానలను వ్యతిరేకిస్తూ బ్రెగ్జిట్‌ మంత్రి  డేవిడ్‌ డేవిస్‌ రాజీనామా చేశారు. ఈ షాక్‌‌లో ఉన్న థెరీసా మేకు వెంటనే మరో షాక్ ఇస్తూ విదేశాంగ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ కూడా తన రాజీనామాను సమర్పించారు.

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలిగిన సంగతి తెలిసినదే. కేబినెట్‌ సమావేశంలో బ్రెగ్జిట్‌ గురించి చర్చ జరిగిన అనంతరం యురోపియన్‌ యూనియన్‌ దేశాలతో అనుసరించాల్సిన విధానాలను వివరిస్తూ థెరిసా మే ప్రవేశపెట్టిన తన బ్రెగ్జిట్‌ ప్రణాళికకు మంత్రివర్గం నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో, థెరీసా మే బ్రెగ్జిట్ విధానాలను విభేదిస్తూ ఈ ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామాలు చేశారు.  బ్రెగ్జిట్‌‌లోని విధానపర నిర్ణయాలే తమ రాజీనామాలకు కారణమని వీరు చెప్పారు.

ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగటం గురించి చర్చలు జరపటం డేవిస్ బాధ్యత. బ్రెగ్జిట్ విధానాలను చూస్తుంటే ఇవి యూరోపియన్ యూనియన్‌కి సంబంధించిన కస్టమ్స్‌ యూనియన్‌, సింగిల్‌ మార్కెట్‌ను వీడే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని డేవిస్ థెరీసా మేకు సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా.. డేవిస్‌ రాజీనామా చేసిన కొద్ది సేపటికే జూనియర్‌ మంత్రి స్టీవెన్‌ బేకర్‌ కూడా రాజీనామా చేశారు. 

డేవిస్‌ రాజీనామా అంశంపై ప్రధాని స్పందించారు. కేబినెట్ నుంచి ఆయన వైదొలగటం పట్ల తాను విచారంగా ఉన్నానని, ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయే క్రమాన్ని రూపొందించటంలో ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌లో కొనసాగుతున్న బ్రెగ్జిట్‌ ప్రక్రియ మార్త్ 29, 2019 నాటికి పూర్తికావచ్చని తెలుస్తోంది.