Brazil Floods: బ్రెజిల్ ను ముంచెత్తిన వరదలు.. ఎటుచూసినా వరద నీరే.. !
Brazil Floods: బ్రెజిల్ ను వరదలు ముంచెత్తాయి. అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. లక్షలాది మంది ప్రభావితం కాగా, 70కి పైగా పట్టణాలు నీట మునిగాయి. వరదల కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోగా, 286 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Brazil Floods: బ్రెజిల్‌పై ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఆ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా లక్షలాది మంది ప్రభావితం కాగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక పట్టణాలు వరద నీటితో మునిగిపోయాయి. పలు చోట్ల అనకట్టలు సైతం తెగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈశాన్య బ్రెజిల్ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు పొటెత్తి తీవ్రంగా ప్రభావితమయ్యింది. మళ్లీ ఇప్పుడు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బ్రెజిల్ స్థానిక మీడియా నివేదించిన వివరాల ప్రకారం.. భారీ వర్షాలతో వరదలు రావడంతో బహియా ప్రాంతంలో నివసిస్తున్న 4,30,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 72కు పైగా పట్టణాలు ప్రభావితం అయ్యాయి. అక్కడ అత్యవస పరిస్థితి కొనాసాగుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 286 మంది తీవ్రంగా గాయపడ్డారు. వరదలపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన అధికారులు.. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించాయని వెల్లడించారు.
Also Read: Telangana: తెలంగాణలో కరెంట్ షాక్.. ఇక ఛార్జీల మోతే !
బ్రెజిల్‌లోని బహియా రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలోని ఇటాపెటింగా నగరంలో భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్రెజిల్ మంత్రి జోవా రోమా మీడియాతో మాట్లాడుతూ.. వరదల బాధితులకు సహాయం చేయడానికి దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 90 మందికి పైగా వైద్యులను బహియాకు మోహరించనుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరదలు పొటెత్తాయి. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, ప్రజలను వారి ఇళ్లపై నుండి, పడవలతో బయటకు తీసుకురావడానికి చర్యలను ముమ్మరం చేశామని మంత్రి వెల్లడించారు. బహియా గవర్నర్ రుయి కోస్టా ఆదివారం ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. ఆహారం, పరుపులు, వెచ్చని దుస్తులు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం కురుస్తన్న భారీ వర్షాల ధాటికి డ్యాముల్లో భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న, ఈశాన్య బ్రెజిల్‌లో రెండు డ్యామ్‌లు దెబ్బతిన్నాయి. డ్యాముల దిగువ ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉండటంతో ఇప్పిటికే ప్రజలు అక్కడి ప్రాంతాలను విడిచి వెళ్లారు.
Also Read: Afghanistan: రాక్షస పాలనకు నాంది.. ఆఫ్ఘాన్ తాలిబన్ సర్కారు మరో సంచలన నిర్ణయం
భారీగా వచ్చిన వరద నీటితో కూలిపోయిన డ్యాముకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారీగా వచ్చిన వరద నీరు కారణంగా ఆనకట్ట తెగిపోయింది. మరికొద్ది సమయంలో ఇతాంబే మునిసిపాలిటీని వరదలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. నివాసితులందరూ వెర్రుగ నది ఒడ్డు నుండి అత్యవసరంగా ఖాళీ చేయాలి అని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, రెండు రోజుల్లో పరిస్థితులు అదుపులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు నీట మునిగి ఉండగా, మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనాలు ప్రజల్లో భయాందోళనలు పెంచాయి. బహియాలో సుమారు 50 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల వరకు కురిసే అవకాశం అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని బ్రెజిల్ వాతావరణ, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Also Read: Rakesh Tikait: ప్రధాని మోడీ నుంచి క్షమాపణలు కోరడం లేదు కానీ.. రాకేష్ టికాయత్ కీలక వ్యాఖ్యలు