ఉత్తర టర్కీలోని బార్టిన్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో కనీసం 25 మంది మరణించారు. డజన్ల కొద్దీ కార్మికులు భూగర్భంలో చిక్కుకున్నారు.

టర్కీ : టర్కీలోని ఉత్తర బార్టిన్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మరణించారు. అనేకమంది గనిలో చిక్కుకున్నట్లు బీబీసీ నివేదించింది. నల్ల సముద్ర తీరంలోని అమాస్రాలోని ఫెసిలిటీలో శుక్రవారం ఈ పేలుడు సంభవించింది. గనిలో చిక్కుకుపోయిన వారిలో 11 మందిని రక్షించామని, వారికి చికిత్స అందిస్తున్నామని ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో, దాదాపు 110 మంది కార్మికులు గనిలో పని చేస్తున్నారు. వారిలో దాదాపు సగం మంది 300 మీటర్ల లోతులో ఉన్నారు.

"బొగ్గు గనులలో కనిపించే ఓ రకమైన మండే వాయువులను సూచించే ఫైర్‌డాంప్ వల్ల పేలుడు సంభవించిందని ప్రాథమిక అంచనా" అని ఇంధన మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ రాయిటర్స్‌తో అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్లో గనిలో చిక్కుకున్న తమవారికోసం గని దగ్గరికి పెద్ద సంఖ్యలో జనం రావడం కనిపిస్తుంది. 1515 GMT సమయంలో గని ప్రవేశానికి 300 మీటర్లు (985 అడుగులు) దిగువన పేలుడు సంభవించిందని బార్టిన్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఈ గని ప్రభుత్వ యాజమాన్యంలోని టర్కిష్ హార్డ్ కోల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందినది.

అమెరికాలో పాకిస్థాన్ ఆర్థిక మంత్రికి చేదు అనుభ‌వం.. చోర్, అబ‌ద్దాల కోరు అంటూ నినాదాలు

పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు బార్టిన్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ శనివారం ప్రమాద స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రాణనష్టం మరింత పెరగకూడదని, మైనింగ్ కార్మికులు సురక్షితంగా సేవ్ చేయబడతారని, తాము ఈ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.