Asianet News TeluguAsianet News Telugu

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. తక్షణం రిలీజ్ చేయండి : ఆర్మీకి పాక్ సుప్రీంకోర్ట్ ఆదేశం

అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఆయనను తక్షణం విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్ట్ సైన్యాన్ని ఆదేశించింది. 

Big relief for Imran Khan in Pakistan's Supreme Court ksp
Author
First Published May 11, 2023, 6:50 PM IST

అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఆయనను తక్షణం విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్ట్ సైన్యాన్ని ఆదేశించింది. ఆయన అరెస్ట్ చట్ట విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

కాగా..  అవినీతి కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన 70 ఏళ్ల మాజీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను రెండ్రోజుల క్రితం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) ఆదేశాల మేరకు పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు గదిలోకి చొరబడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు వార్త వైరల్ కావడంతో దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. అతడి మద్దతుదారులు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ సహా భద్రతా సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని లాఠీలతో దాడి చేశారు. పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ప్రధాన ప్రాంతాల్లో గుమిగూడడాన్ని నిషేధిస్తూ పోలీసులు సెక్షన్ 144 విధించినా కూడా.. దానిని ఆందోళనకారులు పట్టించుకోలేదు. అయితే లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ, రావల్పిండిలో ఈ నిరసనల వల్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 

అసలేంటీ అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసు :

ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీతో పాటు వారి సన్నిహితులు జుల్ఫికర్ బుఖారీ, బాబార్ అవాన్‌లు పంజాబ్‌లోని జీలం జిల్లాలో వున్న సోవాహ తహసీల్‌లో నాణ్యమైన విద్యను అందించడానికి అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించే లక్ష్యంతో అల్ ఖాదిర్ ప్రాజెక్ట్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. కొన్ని పత్రాలలో ట్రస్ట్ కార్యాలయ చిరునామా బానీగాలా హౌస్ , ఇస్లామాబాద్‌గా పేర్కొన్నారు. బుష్రా బీబీ 2019లో ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన బహ్రియా టౌన్ నుంచి విరాళాలు స్వీకరించడానికి ఒక మెమోరాండపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా బహ్రియా టౌన్ నుంచి 458 కెనాల్స్, 4 మార్లాస్, 58 చదరపు అడుగుల భూమిని స్వీకరించింది. 

Also Read: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరుగురు ఆర్మీ అధికారులు.. పాక్‌లో సైన్యం తిరుగుబాటు చేయనుందా, వచ్చే 72 గంటలు కీలకం

అయితే, పాక్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా ప్రకారం.. ఈ 458 కెనాల్స్ భూమిలో, ఇమ్రాన్ ఖాన్ దాని వాటాలను ఫిక్స్ చేశారు. అనంతరం విరాళంగా ఇచ్చిన భూమిలో 240 కెనాల్స్‌ను బుష్రా బీబీకి సన్నిహితురాలు ఫరా గోగి పేరు మీద బదిలీ చేశారు. ఈ భూమి విలువను తక్కువగా అంచనా వేయబడటంతో పాటు ఇమ్రాన్ తన వాటాను విశ్వవిద్యాలయం పేరుతో పొందాడు. అంతేకాదు.. మాజీ ప్రధాని ఈ విషయాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నించారని సనావుల్లా పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios