Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరుగురు ఆర్మీ అధికారులు.. పాక్‌లో సైన్యం తిరుగుబాటు చేయనుందా, వచ్చే 72 గంటలు కీలకం

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో పాకిస్తాన్ అగ్నిగుండంలా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వార్త అక్కడ దావానంలా వ్యాపిస్తోంది. పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే యోచనలో వున్నట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

6 army officers against the army chief and govt next 72 hours important for pakistan ksp
Author
First Published May 11, 2023, 5:57 PM IST

అవినీతి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌ అయిన నాటి నుంచి పాకిస్థాన్‌లో మంటలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టుకు నిరసనగా ఆయన మద్ధతుదారులు పలు చోట్ల వాహనాలు, భవనాలు, కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు , సానుభూతిపరులు నిరంతరం వీధుల్లో విధ్వంసానికి పాల్పడుతూనే వున్నారు. ఇంతలో ఓ వార్త పాకిస్థాన్‌నే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రస్తుతం పాక్ సైన్యంలో కూడా తిరుగుబాటు మంటలు రాజుకున్నాయన్నది ఆ వార్త సారాంశం. పాక్ ఆర్మీ చీఫ్‌పై, పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆరుగురు సీనియర్ ఆర్మీ అధికారులు ఎదురు తిరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ అధికారి ఒకరు తెలిపారు. 

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ , పాలక పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM)కి వ్యతిరేకంగా సైన్యంలోని 6 మంది లెఫ్టినెంట్ జనరల్‌లు వ్యతిరేకంగా మారారని పాకిస్తాన్ ఆర్మీ మేజర్ ఆదిల్ రాజా (రిటైర్డ్) సంచలన ట్వీట్ చేశారు. ఆదిల్ రాజా వాదన ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఆసిఫ్ గఫూర్, అసిమ్ మాలిక్, నౌమాన్ జకారియా, సాకిబ్ మాలిక్, సల్మాన్ ఘని , సర్దార్ హసన్ అజార్ బహిరంగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరియు పిడిఎమ్‌లను వ్యతిరేకిస్తున్నారు. ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (CJCSC) ద్వారా పరిష్కారానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 48 నుంచి 72 గంటలు పాకిస్థాన్‌కు చాలా కీలకమని చెబుతున్నారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ , ప్రధాని షాబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ సైన్యంలోని ఆరుగురు లెఫ్టినెంట్ జనరల్స్ ఒకచోట చేరి, అధ్యక్షుడు, చీఫ్ జస్టిస్ , తీర్మాన ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వడంతో రాబోయే 48 నుండి 72 గంటలు పాకిస్తాన్ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవని విశ్లేషకులు అంటున్నారు. పాకిస్థాన్ ఇప్పుడు అంతర్యుద్ధం అంచున నిలుస్తోంది. పలుచోట్ల హింస, విధ్వంసకాండ జరుగుతుండగా.. కాల్పులను నియంత్రించేందుకు పాక్ సైన్యం మోహరింపును పెంచుతున్న తీరు కూడా అనేక అనుమానాలను కలిగిస్తోంది. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తుతున్న ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్‌లలో చాలా మంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చివరకు అసీమ్ మునీర్ వైపే ప్రధానమంత్రి షాబాజ్‌ మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు అసీమ్ మునీర్‌తో పాటు పీఎం షాబాజ్ షరీఫ్‌లకు కష్టాలు పెరగవచ్చు. పాకిస్థాన్‌లో అంతర్యుద్ధం జరుగుతుందా,  ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ను, ప్రధానిని తొలగించి ఆ దేశ ఆర్మీ కమాండ్ .. కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తుందా చూడాలి.

కాగా..  అవినీతి కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన 70 ఏళ్ల మాజీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను రెండ్రోజుల క్రితం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) ఆదేశాల మేరకు పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు గదిలోకి చొరబడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు వార్త వైరల్ కావడంతో దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. అతడి మద్దతుదారులు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ సహా భద్రతా సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని లాఠీలతో దాడి చేశారు. పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ప్రధాన ప్రాంతాల్లో గుమిగూడడాన్ని నిషేధిస్తూ పోలీసులు సెక్షన్ 144 విధించినా కూడా.. దానిని ఆందోళనకారులు పట్టించుకోలేదు. అయితే లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ, రావల్పిండిలో ఈ నిరసనల వల్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 

అసలేంటీ అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసు :

ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీతో పాటు వారి సన్నిహితులు జుల్ఫికర్ బుఖారీ, బాబార్ అవాన్‌లు పంజాబ్‌లోని జీలం జిల్లాలో వున్న సోవాహ తహసీల్‌లో నాణ్యమైన విద్యను అందించడానికి అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించే లక్ష్యంతో అల్ ఖాదిర్ ప్రాజెక్ట్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. కొన్ని పత్రాలలో ట్రస్ట్ కార్యాలయ చిరునామా బానీగాలా హౌస్ , ఇస్లామాబాద్‌గా పేర్కొన్నారు. బుష్రా బీబీ 2019లో ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన బహ్రియా టౌన్ నుంచి విరాళాలు స్వీకరించడానికి ఒక మెమోరాండపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా బహ్రియా టౌన్ నుంచి 458 కెనాల్స్, 4 మార్లాస్, 58 చదరపు అడుగుల భూమిని స్వీకరించింది. 

అయితే, పాక్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా ప్రకారం.. ఈ 458 కెనాల్స్ భూమిలో, ఇమ్రాన్ ఖాన్ దాని వాటాలను ఫిక్స్ చేశారు. అనంతరం విరాళంగా ఇచ్చిన భూమిలో 240 కెనాల్స్‌ను బుష్రా బీబీకి సన్నిహితురాలు ఫరా గోగి పేరు మీద బదిలీ చేశారు. ఈ భూమి విలువను తక్కువగా అంచనా వేయబడటంతో పాటు ఇమ్రాన్ తన వాటాను విశ్వవిద్యాలయం పేరుతో పొందాడు. అంతేకాదు.. మాజీ ప్రధాని ఈ విషయాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నించారని సనావుల్లా పేర్కొన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios