కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయంపై దాడి.. ఘాటుగా స్పందించిన భారత్
అమెరికా కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయంపై దాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఇలాంటి శక్తులకు దేశంలో చోటు ఇవ్వకూడదని అక్కడి ప్రభుత్వానికి సూచించింది.
కాలిఫోర్నియాలోని ప్రముఖ హిందూ దేవాలయాన్ని ఖలిస్థాన్ అనుకూల నినాదాలు, భారత్ వ్యతిరేక గ్రాఫిటీలతో విధ్వంసం చేయడంపై భారత్ స్పందిచింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. నెవార్క్ లోని స్వామినారాయణ్ మందిర్ వాసనా సంస్థ గోడలపై భారత్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విద్వేషపూరిత నినాదాలతో గ్రాఫిటీ వేశారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలను హిందూ-అమెరికన్ ఫౌండేషన్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో షేర్ చేసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తీవ్రవాదులకు దేశంలో చోటు ఇవ్వొద్దని అన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ ఇప్పటికే ఈ విషయాన్ని అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లిందని చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
‘‘నేను ఆ వార్త చూశాను. మీకు తెలుసు.. మేము దీని గురించి ఆందోళన చెందుతున్నాం. భారత్ వెలుపల తీవ్రవాదులు, వేర్పాటువాద శక్తులకు చోటు కల్పించకూడదు. ఏం జరిగిందో మన కాన్సులేట్ అక్కడి ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేసిందని, దీనిపై విచారణ జరుపుతున్నారని నేను నమ్ముతున్నాను’’ అని జై శంకర్ తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. దీనిని తీవ్రంగా ఖండించింది. ఈ చర్య భారతీయ సమాజం మనోభావాలను దెబ్బతీసిందని చెప్పారు. ‘‘ఈ ఘటన భారతీయ సమాజం మనోభావాలను దెబ్బతీసింది. ఈ విషయంలో అమెరికా అధికారులు త్వరితగతిన దర్యాప్తు చేసి దుండగులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాం’’ అని ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
ఈ ఘటన గురువారం రాత్రి జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి సమీపంలో నివసిస్తున్న ఒక భక్తుడు భవనం బయటి గోడపై నల్ల సిరాలో హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక గ్రాఫిటీని గుర్తించారని, వెంటనే స్థానిక యంత్రాంగానికి సమాచారం అందించామని ఆలయ పరిపాలన అధికార ప్రతినిధి భార్గవ్ రావల్ తెలిపారు. అయితే దీనిని నేవార్క్ పోలీసులు లక్షిత చర్యగా భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.